విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ పరిధిలో 700 వరకు మెకనైజ్డ్ బోట్లు, 3000 వరకు ఇంజిన్ బోట్లు ఉన్నాయి. ఏటా వీటి సంఖ్య పెరుగుతోంది. ఈ ఓడరేవుపై ఒత్తిడి తగ్గించే ఉద్దేశంతో గతంలోనే పూడిమడక ప్రాంతంలో మరొక ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని ప్రతిపాదించారు. 2017-18లోనే ఇక్కడ చేపలరేవు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వ్యాపకోస్ సంస్థ అధ్యయనం చేసింది. ఓడరేవు నిర్మాణంతో స్థానికంగా జరగనున్న అభివృద్ధి.. నిర్మాణ, నిర్వహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమగ్ర నివేదికను అందించింది. ఈ నివేదిక ఆధారంగానే ఈనెల 31న ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. మంగళవారం సంయుక్త కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, మత్స్యశాఖ జేడీ ఫణిప్రకాష్ పూడిమడక ప్రాంతంలో పర్యటించి చేపలరేవు నిర్మించబోయే స్థలాన్ని పరిశీలించారు.
ఇక్కడే ఎందుకంటే..
జిల్లాలో అతిపెద్ద మత్స్యకార గ్రామం పూడిమడక. 18 వేలకు పైగా జనాభా చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ఒక్క గ్రామంలోనే 340 రిజిస్టర్డ్ బోట్లలో 1,640 మంది మత్స్యకారులు చేపలవేట సాగిస్తున్నారు. టన్నుల కొద్ది బరువు ఉన్న పడవలను సముద్రంలోకి మోసుకెళుతుంటారు. కొంతమంది సముద్రంలోనే బోట్లను లంగర్ వేసి వదిలేస్తుంటారు. ప్రకృతి విపత్తుల సమయంలో కొన్ని బోట్లు కొట్టుకుపోతున్నాయి. సముద్రంలో వదిలేయడం వల్ల బోట్ల మన్నిక దెబ్బతింటోంది. దీనికోసమే పూడిమడక తీరంలో జెట్టీ నిర్మించాలని ఎన్నో ఏళ్లగా డిమాండ్ ఉంది. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు మత్స్యకారుల చెంతకు రాబోతోంది.
అభివృద్ధికి ఊతం : విశాఖ ఫిషింగ్ హార్బర్ తరువాత ఎక్కువ చేపలు పూడిమడక తీరంలోనే పడతారు. ఇక్కడ లభించిన చేపలు విశాఖతోపాటు కేరళ, తమిళనాడు, హైదరాబాద్, బెంగళూరుతోపాటు జపాన్‌కు సైతం ఎగుమతి చేస్తుంటారు. హార్బర్‌తోపాటు బోట్ మరమ్మతుల కేంద్రం, శీతల గిడ్డంగి, వలలు అల్లిక, వేలం హాలు నిర్మించనున్నారు. దీంతో స్థానికంగా అభివృద్ధికి ఊతం లభిస్తుంది.
జాగ్రత్తలు అవసరం: చేపలరేవు నిర్మాణ సమయంలో వాయు, శబ్దకాలుష్యం రాకుండా గుత్తేదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని అధ్యయన సంస్థ తన నివేదికలో పేర్కొంది. సమీప గ్రామస్థులకు ఇబ్బంది లేకుండా శబ్దనిరోధక పరికరాలను ఉపయోగించాలని సూచించింది. నిర్మాణ సమయంలో వెలువడే ఘన వ్యర్థాల తరలింపులోనూ జాగ్రత్తలు తీసుకోవాలి.
బహుళ ప్రయోజనాలు
- ఫణిప్రకాష్, జేడీ, మత్స్యశాఖ
పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణంతో బహుళ ప్రయోజనాలు కలగనున్నాయి. పరిసరాలన్నీ వేగంగా అభివృద్ధి బాట పడతాయి. ముఖ్యంగా బోట్లు మోసుకుని సముద్రంలోకి వెళ్లే బాధ తప్పుతుంది. స్థూల జాతీయ ఉత్పత్తిలో జిల్లా స్థానం మెరుగవడానికి అవకాశం ఉంది.
ఇదీ చదవండి:
వరికపూడిశెల ఎత్తిపోతల పథకం నిర్మాణానికి తొలిదశ నిధులు మంజూరు