Attack: తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనం తమకు వద్దని, సొంత వాహనంలో వెళ్లిపోతామని చెప్పినందుకు.. ఆసుపత్రి భద్రతా సిబ్బంది ఒకరు బాలింత భర్తపై దాడి చేశాడు. ఈ ఘటన విశాఖ కేజీహెచ్ ప్రసూతి విభాగం వెలుపల జరిగింది. అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం పెనుగోలు ధర్మవరం గ్రామానికి చెందిన సారిపిల్లి మనోజ్ తన భార్య ఝాన్సీని ప్రసవం కోసం ఈనెల 19న కేజీహెచ్‌లో చేర్పించారు. ఈనెల 21న ఆమెకు ఆడబిడ్డ పుట్టింది. బాలింత కోలుకోవడంతో మంగళవారం డిశ్చార్జి చేశారు.
ఆ సమయంలో మనోజ్ వద్దకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనం డ్రైవరు ఒకరు వచ్చి వారి స్వగ్రామానికి వాహనంలో తీసుకువెళతానని చెప్పారు. అయితే తమకు సొంత వాహనం ఉందని, అందులో వెళతామని మనోజ్ చెప్పగా.. అంగీకరించిన వాహన డ్రైవరు అవసరమైన పత్రాలు వారికి ఇచ్చి పంపేశారు. ఆ తరవాత భార్య, బిడ్డ, తల్లిదండ్రులతో కలిసి వారి వాహనం వద్దకు వెళుతుండగా మరో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవరు వచ్చి మనోజ్‌తో వాగ్వాదానికి దిగారు.
తాము ఉన్నది బాలింతలను తరలించడానికేనని, సొంత వాహనంలో వెళ్లకూడదని అడ్డుపడ్డాడు. దీనికి వారు అంగీకరించకపోవడంతో ఘర్షణ మొదలైంది. ఇంతలో అక్కడే భద్రతా విధులు నిర్వహిస్తున్న కుమార్ దూసుకొచ్చి మనోజ్ కంటిపై బలంగా కొట్టడంతో ముక్కు వెంట రక్తం వచ్చింది. ఇది జరుగుతున్న సమయంలోనే తన తల్లిదండ్రులతో కూడా భద్రతా సిబ్బంది వాగ్వాదానికి దిగారని ఆయన వాపోయారు. ఈ ఘటనపై ఆసుపత్రి వైద్యాధికారులకు ఫిర్యాదు చేసి.. వెళ్లిపోయామని ఆయన తెలిపారు.
విచారణ చేపడతాం..: ప్రసూతి విభాగం వద్ద చోటుచేసుకున్న ఘటనపై విచారణ చేపడతామని ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారిణి డాక్టర్ పి.మైథిలి తెలిపారు. భద్రతా విభాగ ఉద్యోగి దాడికి పాల్పడినట్లు బాధిత కుటుంబ సభ్యులు చెప్పారని, దీని ఆధారంగా విచారణ చేయాలని ప్రసూతి విభాగ అధిపతి డాక్టర్ నాగమణిని ఆదేశించామన్నారు. భద్రతా ఉద్యోగికి నోటీసులు జారీ చేశామని చెప్పారు.
బిడ్డకో రేటు వసూలు..: తన భార్య ప్రసవం కోసం వస్తే ఆసుపత్రి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పెట్టారని మనోజ్ వాపోయారు. మగబిడ్డ పుడితే రూ.5వేలు, ఆడబిడ్డ పుడితే రూ.3వేల చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ముడుపులు ఇస్తే తప్ప వైద్య సేవలు అందడం లేదని వాపోయారు.
ఆసుపత్రిలో దొంగల బెడద కూడా ఉందని, తన సెల్‌ఫోను, పర్సు చోరీ చేశారని, పర్సులో రూ.4వేల నగదు ఉందన్నారు. తెలిసిన వారి వద్ద అప్పు తీసుకొని ఆసుపత్రి నుంచి బయట పడ్డామని వివరించారు. మంగళవారం తాము ఒకరితో వాగ్వాదానికి దిగితే మరొకరు వచ్చి దాడి చేసి గాయపర్చారని, ఇదంతా మామూళ్ల కోసం జరుగుతున్న తంతేనని ఆరోపించారు. -బాధితుడు మనోజ్
ఇదీ చదవండి: