Arunachal Pradesh CM: ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండూ పేర్కొన్నారు. శనివారం రాత్రి ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అసెంబ్లీ హాల్లో ‘సమాలోచన’ సంస్థ మేధావుల ఫోరం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘భారతదేశ భద్రతలో ఈశాన్య రాష్ట్రాల వ్యూహాత్మక అభివృద్ధి ప్రాధాన్యం’ అనే అంశంపై ప్రసంగించారు. దశాబ్దాలుగా నిరాదరణకు గురైన ఈశాన్య రాష్ట్రాల్లో ప్రస్తుత ప్రధాని మోదీ చొరవతో పలు మౌలిక వసతులు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు.
టిబెట్‌ను చైనా ఆక్రమించుకోవడంతో అరుణాచల్‌ప్రదేశ్‌కు చైనా సరిహద్దు వచ్చినట్లయిందన్నారు. సరిహద్దుల్లో ఒకప్పుడు తాత్కాలిక నిర్మాణాలే ఉండేవని, ప్రస్తుతం యుద్ధాల్ని తట్టుకునే పక్కా నిర్మాణాలు, రహదారుల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. చైనా దుందుడుకు చర్యలకు దీటుగా మనం సమాధానం ఇస్తున్నామని వెల్లడించారు. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ లాంటి సినిమాలు అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ బాగా హిట్ అయ్యాయని పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను పెంచి అభివృద్ధిని వేగవంతం చేశామన్నారు. ‘ఉడాన్’ పథకం కింద పౌర విమానయాన సర్వీసులు కూడా ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో ఈశాన్యంలో వేర్పాటువాద ఉద్యమాలు పెరిగి, అవినీతిమయంగా ఉండేదని ప్రస్తుతం రాష్ట్రం ప్రశాంతంగా ఉందని తెలిపారు. విశాఖలో బౌద్ధ పర్యాటకం అభివృద్ధికి తమవంతు సహాయం చేస్తామన్నారు.
ఎంతో సంతోషంగా ఉంది: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అద్భుతమైన వ్యక్తని, ఆయనతో చాలాసార్లు మాట్లాడానని గుర్తుచేశారు. ఆయన చదివిన ఆంధ్రవిశ్వవిద్యాలయానికి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు, భాజపా జిల్లా అధ్యక్షుడు ఎం.రవీంద్ర, సమాలోచన సంస్థ అధ్యక్షుడు రాగం కిశోర్, ఆర్‌ఎస్‌ఎస్ సంఘ్‌చాలక్ పి.వి.నారాయణరావు, ఏయూ ఇంజినీరింగ్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ ఆచార్య అవధాని తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: