ప్రజాప్రతినిధులమైన తమకు తగిన గుర్తింపు, గౌరవం దక్కడం లేదని, అధికారులు తమ మాటకు విలువ ఇవ్వడం లేదని విశాఖ జిల్లా వైకాపా ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అధ్యక్షతన శుక్రవారం విశాఖలో జరిగిన వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీల భేటీ వాడివేడిగా సాగింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు నిర్వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను విస్పష్టంగా వెల్లడించినట్లు సమాచారం. ఈనెల 10న జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కన్నబాబు అధ్యక్షతన జరిగిన డీఆర్సీలో ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ బాహాటంగానే అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
దీంతో విశాఖ పంచాయితీపై సీఎం జగన్ దృష్టి సారించారు. సీఎం ఆదేశాల మేరకు ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రవారం విశాఖ జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యేలు, ఎంపీ విజయసాయిరెడ్డి.. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో పరిగణనలోకి తీసుకోవల్సిన అంశాలు, స్థానిక ఎన్నికలు, పార్టీ కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై చర్చించినట్లు చెప్పారు. అయితే లోపల పలు అంశాలపై ఎమ్మెల్యేలు నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలు వెల్లడించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాల్లో పనులు సకాలంలో జరగకపోతే ఎలా అని ప్రశ్నించినట్లు తెలిసింది. 5 గంటల సేపు సమావేశం సాగినా కీలక విషయాలను నేతలెవరూ బయటపెట్టలేదు. సమావేశానికి మీడియాను అనుమతించలేదు. జిల్లాకు చెందిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు, పెందుర్తి, పాడేరు ఎమ్మెల్యేలు అదీప్‌రాజు, భాగ్యలక్ష్మి, అనకాపల్లి ఎంపీ సత్యవతి మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు.
వచ్చే ఏడాది డిసెంబరుకు పోలవరం పూర్తి
ప్రాజెక్టు ప్రణాళిక ప్రకారం పూర్తవుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రాజెక్టులో ఎలాంటి మార్పులు ఉండవన్నారు. వైజాగ్ వాకథాన్‌లో పాల్గొని మాట్లాడారు. 2021 డిసెంబరు నాటికి ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందన్నారు. నిధుల కొరతపై విలేకరులు ప్రశ్నించగా.. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో అది సర్వసాధారణమన్నారు.
ఇదీ చదవండి: దీపకాంతులతో సుందరంగా ముస్తాబైన ఆలయాలు