Contract Workers Protest: విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రి( కేజీహెచ్) లో తొలగించిన స్టాఫ్ నర్సులను, అనస్థీషియా టెక్నీషియన్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ కాంట్రాక్ట్- అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.మణి కోరారు. ఈ మేరకు ఫెడరేషన్ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
కింగ్ జార్జి ఆసుపత్రిలో 2020 జూలై 7వ తేదీన కరోనా కారణంగా 139 మంది స్టాఫ్ నర్సులు, 25 మంది అనస్థీషియా టెక్నీషియన్లను ఒక సంవత్సరం కాలపరిమితితో తీసుకున్నారని మణి వెల్లడించారు. వీరందరినీ ప్రతిభ ఆధారంగా, రోస్టర్ పాయింట్స్ ద్వారా నియమించారని, 6 నెలల క్రితం అర్ధాంతరంగా విధుల నుండి తొలగించగారని తెలిపారు. కలెక్టరు అనుమతితో ఆరు నెలల పాటు వీరి కాలపరిమితిని పెంచారని గుర్తు చేశారు.
మధ్యలో యూ.పీ.హెచ్.పీ నియామకాలు జరిగినప్పుడు అత్యధిక మంది స్టాఫ్‌నర్స్‌లుగా వెళ్ళిపోయారన్నారు. ప్రస్తుతం 47 మంది స్టాఫ్‌నర్సులు, 23 మంది అనస్థీషియా టెక్నీషియన్లు మిగిలిపోయారని తెలిపారు. వీరిని కింగ్ జార్జి ఆసుపత్రిలో తిరిగి నియమించాలని కోరారు. కేజీహెచ్‌లో స్టాఫ్‌నర్స్‌ల కొరత తీవ్రంగా ఉందని, రెండు వార్డులకు కలిపి ఒక స్టాఫ్‌నర్స్ మాత్రమే పనిచేస్తున్నారని వివరించారు.
రోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వీరిని తిరిగి నియమించాలని మణి కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు.ఈ నిరసన కార్యక్రమంలో ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు పి.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా.. ఎండీ రహుల్లా నామినేషన్ దాఖలు