విశాఖలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అనిశా వలకు చిక్కిన ఏఈ నాగేశ్వరరావు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఆయనకు ఉన్న ఇళ్ల స్థలాలు, లాకర్లలో తొలిరోజు సోదాలు ముగిశాయి. పుస్తక విలువ ప్రకారం 3.88 కోట్ల రూపాయల ఆస్తులను అనిశా అధికారులు గుర్తించారు. ఉదయం నుంచి ఏపీలో 12చోట్ల సోదాలు నిర్వహించగా.. రెండు లాకర్లు తెరిచి 250గ్రాములు బంగారం స్వాధీనం చేసుకున్నారు.
నాగేశ్వరరావు పేరు మీద కోటి 11 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని.. బ్యాంక్ ఖాతాలో రూ.14లక్షల ఉన్నట్లు అనిశా వెల్లడించింది. సీతమ్మపేట, సీతమ్మధార, ఎంవీపీ కాలనీలో ఖరీదైన ఫ్లాట్లను అనిశా గుర్తించింది. కుమారుడు, భార్య పేరుతోనే నాగేశ్వరరావు ఆస్తులు ఉన్నట్లు అనిశా సోదాల్లో తేలింది. ఏపీతో పాటు తెలంగాణలోను ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం హైదరాబాద్లో అనిశా సోదాలు చేయనుంది. రెండు ఇళ్లు, మూడు ఫ్లాట్లు, రెండు వాహనాలు ఇతర ఆస్తులను అనిశా అధికారులు తనిఖీల్లో గుర్తించారు. నాగేశ్వరరావును అరెస్టు చేసి అనిశా ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.
ఇదీచదవండి: విశాఖలో.. విద్యుత్ ఏఈ ఇంట్లో అనిశా సోదాలు