విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో నివాసముండే ముత్యాలరావు కుమార్తె సంజుశ్రీ..... గత ఆరేళ్లుగా హైపోగ్లెసీమియాతో బాధపడుతోంది. పుట్టినప్పుడు ఆరోగ్యంగానే ఉన్నా ఒకటో ఏట నుంచే షుగర్ లెవల్స్ పడిపోతుండడం వల్ల తల్లిదండ్రులు ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. చిన్నారుల్లో అరుదుగా వచ్చే హైపోగ్లెసీమియాతో పాప బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధరించారు. జిల్లాలో ఏ ఆసుపత్రిలో చూపించినా ఆ జబ్బుకు చికిత్స లేదని క్రమం తప్పకుండా మాత్రలను అందిస్తూ చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడమే పరిష్కారమని వైద్యులు సూచించారు. చిన్నారి పెరిగే కొద్దీ దానంతట అదే జబ్బు తగ్గే అవకాశం ఉందని చెప్పటం వల్ల ఆరేళ్లుగా ఆ చిన్నారిని తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ప్రస్తుతం ఆ బాలిక వయసు 7 ఏళ్లు. అయినా వ్యాధి ఏ మాత్రం తగ్గలేదని బాలిక తల్లిదండ్రులు అంటున్నారు.
బెల్జియం నుంచి మాత్రలు
చిన్నారికి అందించాల్సిన మాత్రలు ప్రస్తుతం మన దేశంలో కొన్నిచోట్ల మాత్రమే లభ్యమవుతున్నాయి. ఒక్కోసారి మాత్రలు ఇక్కడ లభించకపోవటంతో బెల్జియం నుంచి తెప్పించుకుంటున్నారు. ప్రతి నెలా వీటి కోసం రూ.8,500 వెచ్చించాల్సి వస్తోంది. 80 నుంచి 120 స్థాయిలో ఉండాల్సిన చక్కెర స్థాయిలు .... మాత్రలను అందిస్తే చిన్నారిలో 60 నుంచి 80 మధ్య ఉంటుంది. దీనివల్ల పాపకు ఎప్పుడు ఏమవుతుందో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సంజు శ్రీ తండ్రి ముత్యాలరావు నగరంలోని ఓ నగల దుకాణంలో పనిచేస్తున్నారు. అతని జీతంతో ఇళ్లు గడవడమే కష్టమవుతుండటంతో చిన్నారి ప్రాణాలను నిలుపుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు.
సాయం కోసం ఎదురుచూపు
ఐదేళ్లుగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదని సంజుశ్రీ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కూతురు వైద్య ఖర్చులు కోసం ఇప్పటికే అప్పులపాలయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, దాతలు స్పందించి తమకు సాయం అందించాలని వేడుకుంటున్నారు.