Subbarao Gupta met Vangaveeti Radha: ఒంగోలులో చోటా రాజన్ గ్యాంగ్, డీ గ్యాంగ్‌లు దిగాయని వైకాపా నాయకుడు సుబ్బారావు గుప్తా విజయవాడ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఆ గ్యాంగులు కోటి రూపాయలతో చేసే పనిని.. తాను లక్ష రూపాయలతో చేస్తానని తెలిపారు.
విజయవాడలోని వంగవీటి రాధాను.. సుబ్బారావు గుప్తా కలిశారు. రాధాతో చర్చించిన విషయాలు బహిర్గతపరచడం సబబు కాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి తనకు అపాయింట్మెంట్ ఇచ్చినా.. దాడి చేసినవారు ఇంతవరకు క్షమాపణ చెప్పనందుకే ఆయనను కలవడం లేదని తెలిపారు. తనకు పూర్తి రక్షణ కల్పించాలని సుబ్బారావు గుప్తా ప్రభుత్వాన్ని కోరారు.
అసలేం జరిగిందంటే!..
ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైకాపా కార్యకర్త సోమిశెట్టి సుబ్బారావు గుప్తాపై అదే పార్టీకి చెందిన మంత్రి బాలినేని అనుచరులు దాడికి పాల్పడటం తీవ్ర సంచలనం కలిగించింది. దీనికి సంబంధిత వీడియో వెలుగులోకి వచ్చింది. గత నెల 12న బాలినేని పుట్టినరోజు వేడుకల్లో సుబ్బారావు గుప్తా మాట్లాడుతూ.... మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్‌లపై చేసిన వ్యాఖ్యలతో ఆయనకు బెదిరింపులు అధికమయ్యాయి. ఒంగోలు లంబాడీడొంకలోని ఆయన నివాసంపై శనివారం రాత్రి కొందరు యువకులు దాడి చేశారు. దీంతో సుబ్బారావు గుప్తా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
సుబ్బారావుపై దాడి..
గుంటూరులోని బస్టాండు సమీపంలోని ఓ లాడ్జిలో తలదాచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాలినేని అనుచరులు కొందరు ఆ ఒక పోలీసు వాహనంతో పాటు మరో ప్రైవేటు వాహనంలో ఆ లాడ్జి వద్దకు చేరుకున్నారు. సుభానీ అనే వ్యక్తి సుబ్బారావు గుప్తాపై దాడికి దిగారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ పదే పదే దాడి చేశారు. తాను మధుమేహంతో బాధపడుతున్నాననీ, తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని.. తనను వదిలిపెట్టాలని గుప్తా వేడుకున్నా వినిపించుకోకుండా దాడి చేశారు. ‘అన్నా మీ కాళ్లు పట్టుకుంటా.. నేను చిన్నప్పటి నుంచి ఆయనకు సేవ చేశా.. పార్టీలో ఏం జరుగుతుందో చెప్పా.. అన్నా.. అన్నా..నీకు దండం పెడతా.. చెప్పేది విను.. ప్లీజ్.. ప్లీజ్...’ అని కాళ్లావేళ్లా పడినా సుభానీ వినిపించుకోలేదు. తీవ్ర స్వరంతో దుర్భాషలాడుతూ గుప్తాను కొట్టారు. ‘చంపేస్తా.. ఎవరు చెబితే నువ్వు మాట్లాడావ్, రెండు నిమిషాల్లో నిన్ను ఏసేస్తాం’ అంటూ తీవ్రస్వరంతో బెదిరించారు. సుభానీతో పాటు మరో వ్యక్తి గుప్తాను చొక్కా పట్టుకుని మంచం మీద నుంచి కిందకు లాక్కొచ్చి మోకాళ్లమీద కూర్చోబెట్టి దండం పెట్టిస్తూ మంత్రి బాలినేనికి క్షమాపణ చెప్పించారు. మొత్తం ఈ ఉదంతాన్ని చిత్రీకరించారు. ఈ వీడియో బయటకు రావడంతో తీవ్ర కలకలం రేపింది
ఇదీ చదవండి:
Nara Chandrababu: 'వైకాపా పాలనతో ప్రజలంతా నష్టపోతున్నారు'