యువత మత్తులో జోగుతుంది. ఊహాలోకం కోసం విలువైన భవిష్యత్తును నాశనం చేసుకుంటుంది. సరదాగా అలవాటు చేసుకుని గంజాయికి బానిసలవుతున్నారు. గంజాయి తాగేందుకు అలవాటు పడిన విద్యార్థులు తమ తోటి వారికి అలవాటు చేస్తున్నారు. అనంతరం వారికి సరఫరా చేస్తూ ఉపాధి పొందుతున్నారు. కుటుంబ, ఆర్థిక పరిస్థితులు, ప్రేమ విఫలం వంటివి కారణాలతోనే గంజాయికి అలవాటు పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. తల్లిదండ్రుల నిఘా లేకపోవటం వల్ల యువత గాడి తప్పుతున్నట్లు పోలీసులు తెలిపారు.
మత్తుకు బానిసలై నేరాలు
మద్యం, గంజాయి అలవాటైన యువత నిత్యం మత్తులో తూగుతున్నారు. వీరి అవసరాలను పలువురు రౌడీ షీటర్లు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మత్తు పదార్థాలు సరఫరా చేసి, వారితో నేరాలు చేయిస్తున్నారు. ఇలా నేరాలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది మైనర్లు ఉంటున్నారు. ఒకేసారి పెద్దమొత్తంలో గంజాయి విక్రయాలు చేపడితే అనుమానం వస్తుందని చిన్న చిన్న పొట్లాలుగా మార్చి విక్రయాలు చేపడతున్నారు. విశాఖ, ఒడిశా సరిహద్దుల నుంచి గంజాయిని నుంచి రైలు, రోడ్డు మార్గాల ద్వారా హైదరాబాద్, కర్ణాటక, పూణె, ముంబయి, చెన్నై నగరాలకు తరలిస్తున్నారు. డబ్బుకోసం కొంతమంది విద్యార్థులు గంజాయి విక్రేతలుగా మారుతున్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థులు.. గంజాయి విక్రేతలు
గంజాయి విక్రయిస్తున్నారనే అనుమానం రాకుండా పోలీసుల కళ్లుకప్పేందుకు కొద్ది మొత్తాల్లో తరలిస్తున్నారు. ఇటీవల ఇద్దరు విద్యార్థులు ద్విచక్రవాహనంపై గంజాయి తీసుకెళ్తూ తిరువూరులో పోలీసులకు చిక్కారు. వీరి నుంచి 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఒకరు విజయవాడలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతుండగా, మరొకరు చదువు పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నారని గుర్తించారు. వీరద్దరూ ఏడాదిన్నరగా తెలంగాణ నుంచి గంజాయిని తీసుకొచ్చి.. విజయవాడలో విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
కళాశాలల్లో సరఫరా
కంచికచర్ల మండలం దొనబండ చెక్ పోస్టు దగ్గర సాధారణ తనిఖీల్లో విద్యార్థులు గంజాయితో పట్టుబడ్డారు. వీరిని విచారించగా.. ఇబ్రహీంపట్నానికి చెందిన మరో ఇద్దరు పేర్లు చెప్పారు. ఈ విషయంపై ఆరా తీసిన పోలీసులు.. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలో ఓ గ్రామం నుంచి గంజాయిని తీసుకొచ్చి.. విజయవాడలోని ఓ కళాశాలలో విద్యార్థులకు విక్రయిస్తున్నారని గుర్తించారు. గంజాయి విక్రయించేవారితో పాటు.. తాగేవారిపై దృష్టి పెట్టామని పోలీసులు చెప్తుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికను జాగ్రత్తగా గమనిస్తుండాలని పోలీసులు సూచిస్తున్నారు. నిఘా లేకపోవడం వల్ల విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు అవుతారని అంటున్నారు.
ఇదీ చదవండి : మాస్క్ పెట్టుకోమన్నందుకు ఉద్యోగినిపై అధికారి చాక్, కర్రతో దాడి