తెలుగు భాషను కాపాడుకుందాం.... స్వాభిమానాన్ని చాటుకుందాం. అనే నినాదంతో విజయవాడ కేంద్రంగా సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. శుక్ర, శని, ఆదివారాల్లో జరిగే ఈ మహాసభలకు దేశవిదేశాల నుంచి భాషాభిమానులు, సాహితీవేత్తలు, రచయితలు తరలిరానున్నారు. కృష్ణాజిల్లా తెలుగు రచయితల మొదటి మహాసభలు 2007లో విజయవాడ కేంద్రంగా జరగ్గా.... అప్పుడే ప్రపంచ స్థాయి తెలుగు రచయితల సంఘాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఆ తర్వాత 2011లో రెండో మహాసభలు విజయవాడలోనే నిర్వహించి... ప్రపంచ తెలుగు రచయితల సంఘాన్ని ఏర్పాటు చేశారు. 2015లో మూడో మహాసభలనూ ఇక్కడే నిర్వహించారు. ప్రపంచంలోని సాహిత్యాభిమానులైన తెలుగువారందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి భాషా వికాసానికి కృషి చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ సారి నాలుగో మహాసభలను నిర్వహిస్తున్నారు.
తెలుగు రుచులతో విందు
గతంలో జరిగిన మూడు మహాసభల కంటే ఈసారి భిన్నంగా దాదాపు 1500 మందికి పైగా ప్రతినిధులు నమోదయ్యారు. కొమర్రాజు లక్ష్మణరావు సభాప్రాంగణం, గిడుగు రామ్మూర్తి సాహితీ సాంస్కృతిక వేదిక, సురవరం ప్రతాపరెడ్డి భాషా పరిశోధన వేదిక ఇలా వివిధ వేదిక ద్వారా 15 సదస్సులు, చర్చలు, సాహితీ సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలుగు భాష పరిరక్షణకు, అభివృద్ధికీ, ఆధునీకరణకు అంతర్జాతీయ స్థాయిలో అంకితమై పనిచేసే సంస్థగా ప్రపంచ తెలుగు రచయితల సంఘం భవిష్యత్ కార్యాచరణ చేపట్టనుంది. మూడు రోజుల పాటు అతిథులకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన తెలుగు రుచులతో కూడిన విందు అందించనున్నారు. ఈ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో తీసుకున్న నిర్ణయాలను, ప్రధాన అంశాలను భవిష్యత్తులో మహాసభల ప్రణాళికలో పొందుపరచనున్నారు.
ఇదీ చదవండి:నేడు మంత్రివర్గ సమావేశం... అసాధారణ భద్రతా ఏర్పాట్లు!