దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన వాణిజ్య పంటలైన పసుపు, మిర్చికి మద్దతు ధర ప్రకటించేలా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కేంద్ర వ్యవసాయ ఖర్చు, ధరల కమిషన్‌ను కోరారు. వీటితో పాటు చిరుధాన్యాలకు మద్దతు ధర ఇవ్వాలని అడిగారు. విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులతో సీఏసీపీ ఛైర్మన్ ప్రొఫెసర్ విజయపాల్‌శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి కన్నబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
సంక్షోభం నుంచి వ్యవసాయాన్ని గట్టెక్కించేందుకు, రైతుకు భరోసాగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఏసీపీ ప్రతినిధులకు మంత్రి కన్నబాబు వివరించారు. దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల మధ్య మద్దతు ధర ప్రకటనలో కొనసాగుతున్న వ్యత్యాసాన్ని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఆయిల్‌పామ్‌కు మద్దతు ధర ఇవ్వాలని... ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని పంటలకు మద్దతు ధర అమలయ్యేలా చూడాలని కోరారు. పంటల వారీగా ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితులను కమిషన్ ముందుంచారు.