తమకు నచ్చిన వారితో, అనువైన సమయంలో శృంగారంలో పాల్గొనడం.. ఈ క్రమంలో గర్భనిరోధక సాధనాల వాడకం, అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్య సేవలు పొందడం.. వంటి విషయాల్లో నిర్ణయం తీసుకునే హక్కు మహిళలకు ఉన్నా.. పురుషాధిపత్యం ఆ హక్కును కాలరాస్తోందని చెబుతోంది ఐరాస జనాభా నిధి (యూఎన్‌పీఎఫ్) ఇటీవలే జరిపిన ఓ అధ్యయనం. ‘నా దేహం.. నా సొంతం’ (మై బాడీ ఈజ్ మై ఓన్)’ పేరుతో.. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతోన్న 57 దేశాలపై (భారత్‌తో కలిపి) జరిపిన ఈ పరిశోధనలో సగానికి సగం మంది మహిళలు లైంగిక విషయాల్లో తమకు ఏ నిర్ణయాధికారం లేదని, తాము కేవలం నామమాత్రమేనని చెబుతున్నారు. అయితే ఇలా మహిళల శారీరక స్వతంత్రతను హరించడమంటే వారి ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించడమేనని, లింగ అసమానతలకు, వివక్షా పూరిత హింసకు అది దారితీస్తుందని యూఎన్‌పీఎఫ్ కార్యనిర్వాహక సంచాలకురాలు డాక్టర్ నటాలియా కానెమ్ అభిప్రాయపడ్డారు.
నివేదిక ఏం చెబుతోందంటే..!
ఆయా దేశాల్లోని మహిళలు, బాలికలపై జరిగే అత్యాచారాలు, కన్యత్వ పరీక్షలు, బలవంతంగా జననేంద్రియాలను తొలగించడం, శాశ్వతంగా పిల్లలు పుట్టకుండా చేయడం.. వంటి పలు అంశాల్ని ఆధారంగా చేసుకొని యూఎన్‌పీఎఫ్ ఈ పరిశోధన జరిపింది. ఇందులో భాగంగా..!
- ఈ దేశాల్లో కేవలం 55 శాతం మంది మహిళలు, బాలికలు.. శృంగారం, గర్భనిరోధక సాధనాల వాడకం, ఆరోగ్య సేవల్ని వినియోగించుకోవడం.. వంటి విషయాల్లో స్వీయ నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. అంటే మిగతా 45 శాతం మంది తమ శరీరం పరాధీనమే అంటున్నారు.
- తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల్లో 76 శాతం మంది కిశోరప్రాయ బాలికలు, మహిళలు లైంగిక పరమైన అంశాల్లో నిర్ణయాధికారం తమదే అన్నారు. అయితే సబ్-సహరన్ ఆఫ్రికా, మధ్య-దక్షిణాసియా దేశాల్లో ఇలాంటి మహిళల శాతం 50 కంటే తక్కువగా ఉంది.
- అంతేకాదు.. ఆయా దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ పరిస్థితుల్లో తేడాలున్నాయని కూడా ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఉదాహరణకు.. సబ్- సహరన్ ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో సుమారు 10 శాతం మంది కిశోర ప్రాయ బాలికలు, మహిళలు మాత్రమే ఈ మూడు అంశాల్లో (శృంగారం, గర్భనిరోధక సాధనాల వాడకం, ఆరోగ్య సేవలు పొందడం) స్వయంగా నిర్ణయం తీసుకుంటున్నారట!
- ఇథియోపియాలో 53 శాతం మంది మహిళలకు తమకు ఇష్టం లేని శృంగారానికి ‘నో’ చెప్పే అధికారముందట! అదే కాంట్రాసెప్షన్ విషయంలో 94 శాతం మంది మహిళలు వ్యక్తిగతంగా, భాగస్వామితో కలిసి నిర్ణయం తీసుకుంటున్నారు.
- నేరారోపణల నుంచి తప్పించుకోవడానికి రేప్ చేసిన వ్యక్తి బాధితురాలిని వివాహం చేసుకోవడానికి అనుమతించే చట్టాలు సుమారు 20 దేశాల్లో ఉన్నాయట!
- పెళ్లైనా.. భాగస్వామి తమకు ఇష్టం లేకుండా బలవంతంగా శృంగారం చేస్తే (మ్యారిటల్ రేప్) దానిపై చర్యలు తీసుకోవడానికి ఎలాంటి చట్టాలు లేని దేశాల సంఖ్య 43గా ఉందట!
- ఇంటి బయట మహిళలు చేసే ఉద్యమాలపై ఆంక్షలు విధించే దేశాల సంఖ్య 30కి పైమాటే అని ఈ అధ్యయనం చెబుతోంది.
నచ్చిన వాడిని ఎంచుకునే హక్కూ లేదు!
ఈ మూడు విషయాల్లోనే కాదు.. చాలా చోట్ల బాలికలు/మహిళలు తమకు నచ్చిన వాడిని ఎంచుకునే విషయంలో కూడా నిర్ణయాధికారం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యూఎన్‌పీఎఫ్ కార్యనిర్వాహక సంచాలకురాలు డాక్టర్ నటాలియా కానెమ్.
‘నచ్చిన వారితో శృంగారంలో పాల్గొనడం, గర్భనిరోధక సాధనాల వాడకం, ఆరోగ్య సేవల విషయాల్లో చాలా దేశాల్లో మహిళలకు స్వేచ్ఛ లేదని ఈ నివేదిక ద్వారా మనకు అర్థమవుతోంది. నిజానికి ఇలా వారి శారీరక స్వతంత్రతను హరించడమంటే మహిళల, బాలికల ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించడమే. ఇలాంటి పరిస్థితులు లింగ అసమానతలకు, వివక్షాపూరిత హింసకు దారితీస్తున్నాయి. అంతేకాదు.. ఇవి మహిళలు/బాలికల ఆరోగ్యం పైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.
ఇవనే కాదు.. కొన్ని చోట్ల నచ్చిన వాడిని ఎంచుకోవడం, నచ్చినప్పుడు పిల్లల్ని కనడం.. వంటి విషయాల్లో కూడా మహిళలకు ఎలాంటి నిర్ణయాధికారం ఉండట్లేదు. ఇందుకు వయసు, లైంగిక విషయాల్లో అవగాహన కొరవడడం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేకపోవడం.. వంటివి ముఖ్య కారణాలవుతున్నాయి..’ అంటారామె. అందుకే ఇలాంటి పరిస్థితుల్ని సమూలంగా తుడిచిపెట్టేయాలంటే తమ అంగీకారంతో పని లేకుండా, తమకు నచ్చకుండా జరిగే ఇలాంటి పనుల విషయంలో నిర్మొహమాటంగా ‘నో’ చెప్పే ధైర్యం కూడగట్టుకోవాలని, పురుషులు కూడా తమ భాగస్వామితో స్నేహపూర్వకంగా మెలుగుతూ-ప్రతి విషయంలో వారి ఇష్టాయిష్టాలకు గౌరవమివ్వాలని అంటున్నారు నటాలియా.
మరి, ఈ విషయంలో మీరేమంటారు? మగవారు తమ కోరిక తీర్చుకోవడానికి ఆడవారి నిర్ణయంతో పనిలేకుండా వారినో ఆటబొమ్మగా పరిగణించడం ఎంతవరకు సమంజసం? లైంగిక పరమైన కోరికలు పురుషులకేనా.. మహిళలకు ఉండకూడదా? ఈ క్రమంలో నచ్చిన భాగస్వామిని ఎంచుకునే హక్కు కూడా ఆడవారికి లేదా? మీ అభిప్రాయాలను కింది కామెంట్ బాక్స్ ద్వారా పంచుకోండి.. ‘నా దేహం నా సొంతం - ఈ విషయంలో మరో వ్యక్తి ప్రమేయం అనవసరం’ అని చాటండి!
ఇదీ చదవండి: