బెజవాడ పురపోరులో వైకాపా మేయర్ అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. మేయర్ సీటు దక్కించుకునేందుకు వైకాపాలో గ్రూపులు పెరగటం ఆ పార్టీ అధిష్ఠానాన్ని కలవరపెడుతోంది. మంత్రి వెల్లంపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న పశ్చిమ నియోజకవర్గం నుంచే మేయర్ అభ్యర్థిని ప్రకటించాలని ఓ వర్గం పట్టుపడుతోంది. ఆ నియోజకవర్గంలో కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న పుణ్యశీల, చైతన్యరెడ్డిల పేర్లను పరిశీలిస్తున్నారు. కిందటి పాలకవర్గంలో ఫ్లోర్‌లీడర్‌గా ఉన్న పుణ్యశీల... మేయర్ అభ్యర్థిత్వం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నా.. మంత్రి నుంచి మద్దతు లేదని అనుకుంటున్నారు. చైతన్యరెడ్డిని మంత్రి ప్రతిపాదిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
సెంట్రల్ నియోజకవర్గం నుంచి తన కుమార్తె, వైద్యురాలు అయిన లిఖితారెడ్డే మేయర్ అభ్యర్థి అని ఫైబర్ గ్రిడ్ ఛైర్మన్ గౌతంరెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. సెంట్రల్ నుంచే పోటీలో ఉన్న ఓ కాంట్రాక్టర్ భార్య శ్రీశైలజ పేరు తెరమీదకు వచ్చింది. ఈ కుటుంబం సీఎం జగన్‌కు సన్నిహితులుగా చెబుతున్నారు. మిగిలిన డివిజన్లలో పోటీలో ఉన్న అభ్యర్థులు భారీగా ప్రచార ఖర్చులు ఆశిస్తున్నారు. తాజాగా వైకాపా ప్రకటించిన ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి సెంట్రల్ నియోజకవర్గానికి దక్కటంతో మేయర్ అభ్యర్థిని మాత్రం పశ్చిమ నియోజకవర్గానికి దక్కేలా చూసుకోవాలని మంత్రి వర్గం పట్టుబడుతోందట. తన మనిషిని మేయర్‌ని చేసుకునేందుకు నియోజకవర్గ ముస్లింలను మంత్రి అణగదొక్కుతున్నారనే అసంతృప్తి ముస్లిం వర్గ వైకాపా నాయకుల్లో వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండీ... విజయవాడ తెదేపా మేయర్ అభ్యర్థి.. కేశినేని శ్వేత ప్రొఫైల్