సార్వత్రిక ఎన్నికలైనా.. స్థానిక సంస్థల ఎన్నికలైనా పారదర్శకంగా.. అవకతవకలు లేకుండా నిర్వహించేందుకు కొన్ని గైడ్‌లైన్స్ ఉన్నాయి. వాటినే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల కమిషన్ పర్యవేక్షణ ఉంటుంది. 1960లో కేరళలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎన్నికల కోడ్ అమలు చేశారు.
జనరల్ కండక్ట్
రాజకీయ పార్టీలు, నేతలు వారి ప్రత్యర్థులను కేవలం వారి పనితీరు మీదే విమర్శలు చేసుకోవచ్చు. కులం, మతం, జాతి ఆధారంగా వ్యాఖ్యలు చేయకూడదు. అనధికార పత్రాలను ఆధారంగా చేసుకుని విమర్శలు చేయకూడదు. ఓటర్లను ఆకట్టుకోవడానికి డబ్బులు ఇవ్వకూడదు.
సమావేశాలు
ప్రతి రాజకీయ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేస్తే.. సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ముందుగానే సమాచారం ఇవ్వాలి. అధికార పార్టీతోపాటు.. అనుమతుల విషయంలో అన్ని పార్టీలకు ఒకే నిబంధన వర్తిస్తుంది.
- నిరసనలు.. ప్రత్యర్థులకు సంబంధించిన దిష్టిబొమ్మలు దహనం చేయడం నిషేధం. రెండు వేర్వేరు పార్టీలకు చెందిన ప్రచారం ఒకే ప్రాంతంలో నిర్వహిస్తుంటే... ఎదురెదురుగా రావడానికి వీల్లేదు. వేర్వేరు మార్గాల్లో వెళ్లాలి.
- పోలింగ్ రోజు పార్టీ తరఫున బూత్ ఏజెంట్‌గా ఉండే వ్యక్తి బ్యాడ్జీ తప్పకుండా పెట్టుకోవాలి. ఎస్ఈసీ అనుమతించిన వారు తప్ప పోలింగ్ బూత్‌లోకి మరొకరు రావడానికి వీల్లేదు. అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఎన్నికల అబ్జర్వర్లను సంప్రదించాలి.
- ఎన్నికలకు 48 గంటల ముందు ఎలాంటి ప్రచారాలు చేయకూడదు.
- ఎన్నికల కోడ్ అమలు ఉన్న సమయాల్లో రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయాలి.
- మద్య నిషేధం అమలులో ఉంటుంది.
అధికార పార్టీకి ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయి?
1979 వరకు అధికార, ప్రతిపక్షాలు అనే తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలకు ఒకే రకమైన నిబంధనలు ఉండేవి. అయితే, 1979 ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రత్యేకంగా కొన్ని షరతులు విధిస్తూ ఎలక్షన్ కోడ్‌లో మార్పులు జరిగాయి. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీలకు ఈ రూల్స్ వర్తిస్తాయి.
- ప్రభుత్వ ఖర్చులతో పత్రికలు, మీడియా, ఇతర మాధ్యమాల్లో ప్రకటనలపై నిషేధం ఉంటుంది.
- అధికార పార్టీలు కొత్త పథకాలు, ప్రాజెక్టులు, విధానాలను ప్రకటించకూడదు.
- ఎంపీ గానీ, మంత్రిగానీ అధికారిక పర్యటనను, పార్టీ పర్యటనను వేర్వేరుగా ఉండేలానే చూసుకోవాలి. రెండింటినీ కలపకూడదు.
- మంత్రులు, ఇతరులు ఎలాంటి ఆర్థికపరమైన లబ్ధి జరిగే ప్రకటనలు చేయకూడదు. కొత్త రోడ్లు నిర్మిస్తాం, మంచినీళ్లు ఇస్తాం లాంటి ప్రకటనలు అస్సలు చేయరాదు.
- ఇతర పార్టీలు ప్రకటనలు ఇచ్చుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి సమాన అవకాశం కల్పించాలి. అధికారంలో ఉన్నవారు నిరంకుశత్వంగా ఉండి, అవతలి వారికి ప్రచారం చేసుకునే కనీస అవకాశం లేకుండా చేయకూడదు.
ఇదీ చదవండి: పొలిటీషియన్ కాళ్లకు పోలీసు నమస్కారం.. వీడియో వైరల్