బెజవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ రథానికి ఉండే 3 వెండి సింహాల ప్రతిమల మాయం కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. గతేడాది అక్టోబరు 17న జరిగిన ఈ ఘటనలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పాత నేరస్థుడు సాయిబాబా, బంగారం వ్యాపారి కమలేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను సీపీ శ్రీనివాసులు, సిట్ చీఫ్ అశోక్‌కుమార్ శనివారం మీడియాకు వెల్లడించారు.
'గతేడాది జూన్ చివరల్లో ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మను దర్శించుకున్నాడు సాయిబాబా. కొండ మీద నుంచి కిందకు వస్తుండగా రథానికి ఉన్న విగ్రహాలను చూశాడు. ఎలాగైనా వాటిని దోచేయాలని అనుకున్నాడు. అక్కడినుంచి ఊరెళ్లిన అతను... కొన్నిరోజుల తరువాత తిరిగి వచ్చి రాత్రివేళ గోడ దూకి రథం వద్దకు చేరుకున్నాడు. ఇనుప రాడ్లతో మూడు వెండి సింహాల విగ్రహాలను తొలగించాడు. నాలుగో విగ్రహం రాకపోవటంతో వదిలేశాడు. వెంటనే మూడు ప్రతిమలను తీసుకుని వెళ్లిపోయాడు. వాటిని 35 వేల రూపాయలకు తణుకులోని బంగారం వ్యాపారి కమలేశ్‌కు అమ్మేశాడు. అనంతరం ఆ వ్యాపారి విగ్రహాలను కరిగించాడు' అని పోలీసులు వెల్లడించారు. చోరీకి గురైన విగ్రహాల బరువు దాదాపు 16 కిలోలు ఉన్నాయని చెప్పారు. ఇందులో నిందితుల నుంచి 9 కిలోల వెండి దిమ్మెలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇతర ఆలయాల్లో చోరీ చేసిన 6.4 కిలోల వెండి దిమ్మెలూ స్వాధీనం చేసుకున్నామని సీపీ శ్రీనివాసులు వివరించారు.
ఇదీ చదవండి
దుర్గమ్మ గుడిలో పాత టికెట్ల దందా... అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం