కరోనా రోగుల తాకిడితో విజయవాడ ప్రభుత్వాసుపత్రి విలవిల్లాడుతోంది. కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరి చనిపోయిన వారిని తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు, బంధువులు సకాలంలో స్పందిచటం లేదు. కేవలం 12 శవాలను మాత్రమే భద్రపరిచే వసతి గల శవాగారంలో ఇబ్బందికర పరిస్థితుల మధ్య మృతదేహాల నిల్వలు పేరుకుపోతున్నాయి. భౌతికకాయాలను తీసుకెళ్లాలని మృతుల కుటుంబాలకు ఆసుపత్రి సిబ్బంది సకాలంలో సమాచారం ఇస్తున్నా స్పందన కొరవడింది. ఈ కారణంగా... మార్చురీ పరిస్థితి.. నరకాన్ని తలపిస్తోంది. ఈ అనివార్య పరిస్థితుల్లోనే 24 గంటల పాటు కొవిడ్ రోగుల సేవలో వైద్యులు, సిబ్బంది విధులు కొనసాగిస్తున్నారు.
దుర్గంధభరితంగా మార్చురీ..
విజయవాడ ప్రభుత్వాసుపత్రి 800 సాధారణ పడకల సామర్థ్యంతో పనిచేస్తోంది. ఇందులో 250 పడకలకు మాత్రం ఆక్సిజన్ పరికరాలు అమర్చి ఉంటాయి. కొవిడ్ కేసుల విజృంభణ తరువాత ఆసుపత్రికి విపరీతమైన ఎద్దడి పెరిగింది. మరణాల సంఖ్య కూడా పెరగటంతో శవాగారం దుర్గంధభరితంగా మారింది. వందల సంఖ్యలో ఆసుపత్రికి చివరి దశలో పరుగులు పెడుతున్న కరోనా నిర్ధరణ బాధితులు.. పడకల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. వార్డులన్నీ నిండిపోయి, పడకలు దొరకని పరిస్థితి నెలకొంది. ఊపిరి తీసుకోడానికి కష్టంగా ఉన్న వారికి ఆరుబయటే అంబులెన్స్‌ల్లో ఆక్సిజన్ అందిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా..
వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 222 ఆసుపత్రుల్లో 23,707 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 10,458 పడకలు రోగులతో నిండాయి. ఇంకా అందుబాటులో 13,249 పడకలు ఉన్నాయి. అన్ని పడకలకు ఆక్సిజన్ సదుపాయం ఉండదు. మరోవైపు... సాధారణ జబ్బులతో చికిత్స కోసం ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుతం కొవిడ్ రోగుల డిమాండ్ రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతుంది. కొవిడ్‌తో చనిపోతున్న వారితో పాటు సాధారణంగా మరణించిన శవాలు సైతం శవాగారంలో భద్రపరచాల్సిన పరిస్థితి నెలకొంది. మృతుల బంధువులకు సకాలంలో సమాచారం అందజేస్తున్నా వారు రాకపోవటంతో ఇబ్బందికరమైన వాతవరణం ఉందని వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:
రాష్ట్రంలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ.. మినహాయింపు ఎవరికంటే..!