యువత నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. అప్పుడే భారతదేశం అభివృద్ధి దిశలో పయనిస్తుందని అన్నారు. విజయవాడ ఆత్కూర్ లోని స్వర్ణభారత్ ట్రస్ట్ లో శిక్షణ పొందుతున్న యువతీయువకులతో ఉపరాష్ట్రపతి ముచ్చటించారు.
యువత నైపుణ్యాభివృద్ధే ధ్యేయంగా స్వర్ణభారత్ ట్రస్ట్ పని చేస్తోందని ఉపరాష్ట్రపతి కొనియాడారు. వృత్తిని ప్రేమించడంతోపాటు మానవీయ విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భారత సనాతన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్న విషయాన్ని గుర్తుంచకోవాలని తెలిపారు. మాతృభాషలో చదువుకోవడం అభివృద్ధికి ఏ మాత్రం ఆటంకం కాదని, ప్రస్తుత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వంటి వారు మాతృభాషలోనే విద్యను అభ్యసించారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
వ్యాయామంతో పాటు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, ఆధ్యాత్మిక చింతన అలవరుచుకోవాలని సూచించారు. ఇవన్నీ మతానికి సంబంధించినవి కావని, మంచి ఆధ్యాత్మిక చింతన ద్వారా సామాజిక బాధ్యత అలవడుతుందని తెలిపారు. ఆరోగ్యం కోసం చక్కని పచనం చేయబడిన భారతీయ ఆహారాన్ని తీసుకోవాలన్నారు. జంక్ ఫుడ్ సంస్కృతిని మానుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: LIVE: స్వర్ణభారత్ ట్రస్టులో 'రైతు నేస్తం' పురస్కారాల ప్రదానం - పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు