అనంతపురం జిల్లా గుంతకల్లులో కన్నతండ్రే కూతురిపై లైంగికదాడికి (Father sexual assault on his daughter case) పాల్పడి గర్భవతిని చేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఘటన పూర్వాపరాలు ఆరా తీసిన వాసిరెడ్డి పద్మ.. అనంతపురం జిల్లా పోలీసు అధికారితో మాట్లాడారు. నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశించారు.
అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం రోజే ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం విచారకరమన్నారు. మహిళలకు ఇంట్లోనే రక్షణలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. పరిచయస్తులే లైంగికదాడికి పాల్పడటాన్ని సమాజం ఈసడించుకోవాలన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహిళా భద్రతకు సంబంధించి అత్యున్నత స్థాయి నిర్ణయాలు అమలు చేస్తున్నారని తెలిపారు. మహిళా భద్రత కోసం రూపొందించిన 'దిశ' యాప్ వినియోగంపై అందరూ దృష్టి సారించాలన్నారు.
ఇళ్లల్లో చెప్పుకోలేని వేధింపుల నుంచి కూడా 'దిశ' యాప్ వినియోగంతో రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల మహిళా పోలీసులు, వాలంటీర్లు, గ్రామైక్య సంఘాల మహిళలతో బాధితులు తమ కష్టాలను చెప్పుకునే వాతావరణం రావాలని అన్నారు.
ఇదీ చదవండి : TDP PROTEST: అనంతపురంలో తెదేపా నాయకులు, పోలీసుల మధ్య తోపులాట