Unemployees Protest: రాష్ట్రంలోని 2.35 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని విజయవాడ ధర్నాచౌక్‌లో విద్యార్థి, యువజన సంఘాలు శనివారం చేపట్టిన మహాధర్నా ఉద్రిక్తంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో వివిధ సంఘాలు పాల్గొన్నాయి. ధర్నాకు విద్యార్థి నాయకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ముందస్తుగానే ధర్నా చౌక్‌కు వెళ్లే మార్గాలన్నింటినీ బారికేడ్లతో మూసేశారు.
లెనిన్ సెంటర్, వంతెన వద్దకు చేరుకున్న విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో నాయకులంతా రోడ్లపై బైఠాయించగా.. పోలీసులు లాక్కెళ్లి పోలీసుస్టేషన్లకు తరలించారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.లెనిన్‌బాబు, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ప్రణవ్ గోపాల్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్‌బాబు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి సూర్యారావు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, ప్రధాన కార్యదర్శి కిలారు నాగశ్రవణ్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్నకుమార్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రవిచంద్ర, ప్రధాన కార్యదర్శి ఎస్.రామ్మోహన్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ సహా పలువురు నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వస్తే పోలీసులు అరెస్టు చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారంలోనికి వచ్చిన వెంటనే ఖాళీలను భర్తీ చేస్తానన్న జగన్.. హామీ నిలబెట్టుకోకుండా నిరుద్యోగులను మోసం చేశారంటూ విమర్శించారు. ఈ సందర్భంగా 300 మందికి పైగా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ మహాధర్నాలో నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళలు జరిగాయి.
ఇదీ చదవండి:
Hc on New Districts: 'కొత్త జిల్లాల ఏర్పాటు.. అధికరణ 371డీకి విరుద్ధం'..హైకోర్టులో పిల్