పల్నాడులో కరవు నివారణతో పాటు ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల కోసం.. రెండు వేర్వేరు వాహక సంస్థలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వీటి నిర్మాణం కోసం నిధులను సమీకరించే నిమిత్తం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఏపీ పల్నాడు ఏరియా డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్స్ కార్పొరేషన్, ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కార్పోరేషన్ పేరిట సంస్థలను ఏర్పాటు చేస్తూ.. జలవనరులశాఖ కార్యదర్శి శ్యామలరావు ఉత్తర్వులు ఇచ్చారు. రూ. 5 కోట్ల మూలధనంతో ఈ ఎస్పీవీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
తక్కువ వర్షపాతం నమోదయ్యే గుంటూరు, ప్రకాశంలోని 9.61 లక్షల ఎకరాల్లో ఆయకట్టుకు సాగునీరు, 54 మండలాల్లో తాగునీరు అందించేందుకు.. పల్నాడు కరవు నివారణ ప్రాజెక్టు కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక్కడ చేపట్టనున్న ప్రాజెక్టు కోసం రూ. 5,343 కోట్లను ఎస్పీవీ ద్వారా సమీకరించనుంది. ఉత్తరాంధ్రలోని వంశధార, నాగావళి, చంపావతి, తాండవ, వరాహ నదులపై ప్రాజెక్టుల నిర్మాణం కోసం.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో పాటు తాండవ ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. దీని ద్వారా 8 లక్షల ఎకరాలకు సాగునీరు చేరుతుందని, 1037 గ్రామాల్లోని 30 లక్షల మందికి తాగునీరు అందుతుందని వెల్లడించింది. ఈ ప్రాజెక్టు కోసం రూ. 8,400 కోట్లు అవసరమవుతాయని జలవనరుల శాఖ అంచనా వేసింది.
ఇదీ చదవండి: ద్వివేది, గిరిజా శంకర్‌పై సెన్సూర్ ప్రొసీడింగ్స్‌ను ఎస్‌ఈసీకి తిప్పిపంపిన ప్రభుత్వం