పార్లమెంటులో రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన చేసి నేటికి ఆరేళ్లు అయిందని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసి రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలోని ఆంధ్రభవన్లో నిర్వహించిన సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడారు. ప్రత్యేక హోదా పదేళ్లు కావాలన్న భాజపా... నేడు అది ముగిసిన అధ్యాయమని మాట్లాడుతుందని ధ్వజమెత్తారు. విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్రానికి ఇవ్వాల్సిన లోటు బడ్జెట్ ఇవ్వకుండా... తీవ్ర అన్యాయం చేస్తున్నారని తులసిరెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు తెదేపా, వైకాపా, జనసేన వంటి ప్రాంతీయ పార్టీలతో సాధ్యం కాదన్నారు. ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే వాటి సాధన సాధ్యమన్నారు. 25 ఎంపీలు ఇస్తే హోదా సాధిస్తామని చెప్పిన వైకాపా... కేంద్రం ముందు మోకరిల్లారని ఆరోపించారు. విభజన హామీల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండీ... చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆస్తులు ఇవే