హైదరాబాద్ శివార్లలో దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. వరుసగా జరుగుతున్న దోపిడీలు, చోరీలు పోలీసులకు సవాలుగా మారాయి. గతనెలలో జీడిమెట్ల వద్ద నగదు బదిలీ దుకాణం యజమానిని ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు తుపాకీతో బెదిరించి రూ.లక్ష 95 వేలు దోచుకున్నారు. ఆ తర్వాత కూకట్‌పల్లి పటేల్‌కుంట పార్కు వద్ద హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో డబ్బులు జమ చేస్తున్నసమయంలో కస్టోడియన్, భద్రతా సిబ్బందిపై దోపిడీ దొంగలు కాల్పులు జరిపి రూ.5 లక్షలు దోచుకుని పారిపోయారు. ఆ ఘటనలో ఘటనతో కస్టోడియన్ గాయపడగా... సెక్యురిటీ గార్డు మృతి చెందాడు.
ఇవాళ తెల్లవారుజామున సుమారు రెండు గంటల ప్రాంతంలో... దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గండిమైసమ్మ కూడలిలో ఉన్న.. ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం గోడకు కన్నం వేసిన దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. లోనికి ప్రవేశించి స్ట్రాంగ్ రూం వద్దకు వెళ్లగానే.. అలారం మోగడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు.
ఇద్దరు ఆగంతకులు గోడకు కన్నం వేసినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పక్కా పథకం ప్రకారమే... చోరీకి యత్నించినట్లు భావిస్తున్నారు. ఫైనాన్స్ కార్యాలయంలోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం పోలీసులు వాటిని విశ్లేషిస్తున్నారు. అసలు దొంగతనానికి యత్నించింది ఎవరు, వారికి నేర చరిత్ర ఏమైనా ఉందా, పరారైన వారు ఎటువైపు వెళ్లారన్న కోణంలో విచారిస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. దొంగలు అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన వారని పోలీసులు భావిస్తున్నారు.
ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని... ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఫైనాన్స్ కార్యాలయాలు రాత్రి వేళ్లల్లో భద్రతా సిబ్బందిని నియమించుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: