కృష్ణాజిల్లాలో ఈ ఏడాది నేరాల సంఖ్య తగ్గినట్లు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ప్రకటించారు. గతేడాది 9,767 కేసులు నమోదు కాగా.. ఈ సంవత్సరం 8,877 మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. గత పన్నెండు నెలల్లో జరిగిన 478 చోరీ కేసుల్లో రూ. 3.52 కోట్ల సొత్తు దోచేయగా.. 53.85 శాతం రికవరీ చేసినట్లు వెల్లడించారు. పేకాట, కోడిపందేలపై 9,626 కేసులు నమోదు చేసి.. రూ.1.85 కోట్లతో పాటు 1,005 కోడిపుంజులు స్వాధీనం చేసుకున్నామన్నారు. గుట్కా విక్రయాలపై 777 కేసులు నమోదు చేయగా.. రూ. 3.30 కోట్ల విలువైన సరుకు అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్‌కి సంబంధించిన 6,011 కేసుల్లో.. రూ. 5.51 కోట్ల విలువైన నాటుసారా, 2.76 లక్షల మద్యం సీసాలు పట్టుకున్నట్లు స్పష్టం చేశారు. ఇసుక, మద్యం అక్రమ రవాణా చేస్తున్న 3,449 వాహనాలను సీజ్ చేశామన్నారు.
నేరస్తుల్లోనూ పరివర్తన...
నాటుసారా పూర్తి నియంత్రణే లక్ష్యంగా చేపట్టిన పరివర్తన కార్యక్రమానికి మంచి గుర్తింపు లభించిందని ఎస్పీ తెలిపారు. ముప్పై ఏళ్లుగా నాటుసారా కాస్తున్న దాదాపు వెయ్యి కుటుంబాల్లో.. స్వచ్ఛందంగా మార్పు తీసుకువచ్చామన్నారు. వీరిలో దాదాపు 4,500 మంది నిరుద్యోగులకు జాబ్‌మేళాలు ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించామని వెల్లడించారు. ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా.. 1,410 మంది వీధి బాలలకు పునరావాసం కల్పించామన్నారు.
రాష్ట్రస్థాయి అవార్డులు సొంతం...
గ్రామాల్లో నేరాలను తగ్గించేందుకు జిల్లా వ్యాప్తంగా 972 గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేసినట్లు రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు. వీటి ద్వారా కొన్ని కేసుల్లో నిందితులను గుర్తించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు ఇతర ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నట్లు పేర్కొన్నారు. పరివర్తన కార్యక్రమానికి స్కోచ్ అవార్డు, గ్రామ రక్షణ దళాల ఏర్పాటుకు గవర్నెన్స్ ఆఫ్ ఇండియన్ పోలీస్ పురస్కారం దక్కాయని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే ప్రథమంగా జిల్లా పోలీస్ కార్యాలయానికి ఐఎస్‌వో 9001:2015 ధ్రువీకరణ దక్కడం గర్వంగా ఉందన్నారు.
పదోన్నతుల్లోనూ భేష్...
గతేడాదితో పోలిస్తే మరణ ప్రమాదాలను 18 శాతం, సాధారణ ప్రమాదాలను 37 శాతం నియంత్రించామని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలోని 60 మంది పీసీలకు హెచ్‌సీలుగా, 73 మంది హెచ్‌సీలకు ఏఎస్సైలుగా, 20 మంది ఏఎస్సైలకు ఎస్సైలుగా పదోన్నతి కల్పించినట్లు స్పష్టం చేశారు. పోలీసుల సంక్షేమానికి ఉపయోగపడేలా.. నగరాల్లో ప్రత్యేకంగా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశామన్నారు.
ఇదీ చదవండి:
15 రోజుల్లో మరోసారి భేటీ... పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం నిర్ణయం