ఒడిశా, బిహార్ తదితర రాష్ట్రాల నుంచి మేక, గొర్రె తలకాయలు, కాళ్లను కొంతకాలంగా గుర్తు తెలియని వ్యక్తులు విజయవాడకు దిగుమతి చేసి ఇక్కడి మాంసం వ్యాపారులు, హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. ఇక్కడి వ్యాపారులు వాటిని అధిక ధరకు విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులకు సమాచారం అందించారు. అధికారులు శనివారం రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. నగరంలోని పలు ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న రూ.2లక్షల విలువైన వేట, గొర్రె తలకాయలు, కాళ్ల బాక్సులను స్వాధీనం చేసుకున్నారు.
16 బాక్సుల్లో విశాఖపట్నం నుంచి రైల్వే పార్శిల్ ద్వారా నగరానికి రాగా, మరో బాక్సు దిల్లీ నుంచి నగరానికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఒక్కో బాక్సులో 60 తలకాయలు ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకున్న నగరపాలక సంస్థ అధికారులు విద్యాధరపురం కబేళాలో పూడ్చిపెట్టారు. నగరంలో వేట తలకాయలు, కాళ్లకు డిమాండ్ ఉంది. ఇక్కడ రూ.800 వరకు ప్రస్తుతం ధర పలుకుతుండగా, ఆదివారాల్లో భారీగా విక్రయాలు జరుగుతాయి. కొందరు ముందుగానే ఆర్డుర్లు, ముందస్తు చెల్లింపుల ద్వారా వాటిని కొనుగోళ్లు చేస్తారు. కొందరు వీటిని ఇతర రాష్ట్రాల్లో అతి తక్కువ ధరలకు సేకరించి రైల్వే పార్శిళ్ల ద్వారా నగరానికి చేర్చుతున్నారు. హోటళ్లు, మాంసం దుకాణాలకు సరఫరా చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇకపై అలాంటివి సాగకుండా తరచుగా దాడులు నిర్వహిస్తామని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రవిచంద్ర స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: లారీతో తొక్కించి ఘాతుకం... వీడిన బొబ్బిలి అనుమానాస్పద మృతి కేసు