ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కొవిడ్ టీకా.. రాష్ట్రానికి వచ్చేసింది. తొలివిడతలో 4,96,680 డోసుల కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను రాష్ట్రానికి పంపించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా పుణెలోని సీఐఐ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్... ప్రత్యేక విమానం ద్వారా గన్నవరం విమానాశ్రయానికి మంగళవారం మధ్యాహ్నం చేరుకుంది. 4,77,000 డోసుల టీకా ఉన్న 40 ప్రత్యేక బాక్సులను పోలీసు బందోబస్తు మధ్య టీకాలు భద్రపరిచే రాష్ట్రస్థాయి కేంద్రానికి తరలించారు. భారత బయోటెక్ దేశీయంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా బుధవారం రాష్ట్రానికి రాబోతుంది. రాష్ట్రానికి వచ్చే టీకాల్లోనే 320 డోసులను యానాం (పుదుచ్చేరి)కి తరలించనున్నారు.
40 బాక్సుల్లో 47,700 వయల్స్ ఉన్నాయి. ఒక్కో వయల్‌లో ఉండే 5 ఎంఎల్ టీకాను 0.5 ఎంఎల్ చొప్పున పది మందికి ఇస్తారు. కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ శ్రీహరి, టీకాలు భద్రపరిచే రాష్ట్ర ప్రధాన కేంద్రం పర్యవేక్షకుడు దేవానందం విమానంలో వచ్చిన టీకా బాక్సులను తగిన ప్రమాణాల మధ్య తరలించారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా కేటాయించిన జిల్లాలకు టీకా తరలించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది.
తొలివిడతలో టీకా ఉపయోగించినచోటే మలి విడతలోనూ ఉపయోగించాలి. కొవిషీల్డ్, కొవాగ్జిన్ రెండు టీకాల్లో దేన్ని ఎక్కడ పంపిణీ చేయాలన్నదానిపై కేంద్ర మార్గదర్శకాలను అనుసరిస్తామని అధికారులు పేర్కొన్నారు. టీకా భద్రపరిచిన గన్నవరంలోని ప్రధాన కేంద్రంలో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఇక్కడ 8 సీసీ కెమెరాలు అమర్చారు. జిల్లాలకు తరలించేందుకు ఆరు వాహనాలు సిద్ధంచేశారు. వీటి రాకపోకలను జీపీఎస్ ద్వారా గమనించేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలకు టీకా తరలించేటప్పుడు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. గన్నవరంలో సిద్ధంగా ఉన్న టీకాను బుధవారం కర్నూలు, కడప, గుంటూరు, విశాఖలోని ప్రాంతీయ కేంద్రాలకు తరలించనున్నారు. అక్కడి నుంచి జిల్లాల్లో ఎంపిక చేసిన కేంద్రాలకు తరలిస్తారు.
ఇదీ చదవండి: