జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ కింద చేసే పనులకు ఇకనుంచి కేంద్ర ప్రభుత్వమే నేరుగా బిల్లులు చెల్లించనుంది. రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీలతో సంబంధం లేకుండా నిర్మాణ సామగ్రి సరఫరాదారుల (వెండర్) ఖాతాల్లోకి బిల్లు మొత్తాలు జమ చేయనుంది. పంచాయతీ పర్సనల్ డిపాజిట్ (పీడీ) ఖాతాలను సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్)కు అనుసంధానించి పంచాయతీలకు దక్కాల్సిన కేంద్ర నిధులను రాష్ట్ర అవసరాలకు ప్రభుత్వం మళ్లించుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల పనులకు బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ఇందులో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ‘ఉపాధి’ పథకం మెటీరియల్ పనులకు నిర్మాణ సామగ్రి సరఫరాదారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారులు చేపట్టారు. పంచాయతీలు తీర్మానం చేసిన పనులకు వీరు సిమెంట్, ఇసుక, ఇనుము, కంకర వంటి సామగ్రి సరఫరా చేస్తారు. పూర్తయిన పనులకు ఇంజినీర్లు లెక్కలు కట్టి బిల్లులు తయారు చేసి ఎన్‌ఐసీ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆ మొత్తాలను కేంద్రం నేరుగా సరఫరాదారు ఖాతాలో జమ చేస్తుంది.
పనుల్లో సర్పంచుల జోక్యానికి చెక్
కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో పనుల్లో సర్పంచుల జోక్యానికి కొంతవరకు అడ్డుకట్ట పడనుంది. ఉపాధి హామీ పథకంలో పంచాయతీల ఆధ్వర్యంలో రహదారులు, కాలువలు, భవన నిర్మాణ పనులు చేస్తుంటారు. వీటిని గుర్తించడం, తీర్మానం చేసి మండల ఇంజినీర్లకు పంపడం వరకు సర్పంచులు క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటారు. ఈ పనుల్లో నిబంధనల ప్రకారం గుత్తేదారుల ప్రమేయం ఉండరాదు. దీంతో సర్పంచులు తమకు కావలసిన వ్యక్తులను నిర్మాణ సామగ్రి సరఫరాదారుగా చూపించి వారితో పనులు చేయిస్తుంటారు. పూర్తయ్యాక వారి పేర్లుతో బిల్లులు చెల్లిస్తుంటారు. ఇక నుంచి చేయాల్సిన పనులకు తీర్మానం చేయడం, అవి పూర్తయ్యాక నిర్ధారించడం వరకే సర్పంచులు పరిమితం కానున్నారు.
పథకంలో అనేక మార్పులు
జాతీయ ఉపాధి హామీ పథకం అమలును పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకుంది. కూలీలతో చేయించే పనుల నుంచి గ్రామాల్లో నిర్మాణ పనులకు బిల్లుల చెల్లింపుల వరకు ఇప్పటివరకు అమలులో ఉన్న విధానంలో అనేక మార్పులు చేసింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) రూపొందించిన పోర్టల్‌లో అన్ని వివరాలూ నేరుగా అప్‌లోడ్ చేయాలి. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో ఈ పోర్టల్ పని చేస్తుంది. ఈ కొత్త వ్యవస్థ వచ్చాక ఉపాధి హామీ పథకం అమలులో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ఇదీ చదవండి: విజయవాడ చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య