విజయవాడ నగరానికి చెందిన కొంతమంది వ్యాపారులు లాభాల కోసం ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. నిషేధిత విదేశీ సిగరెట్లతోపాటు మరికొన్ని కంపెనీల సిగరెట్లను అక్రమంగా రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. విజయవాడ నగరంలో యథేశ్చగా అమ్ముతున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.50 కోట్ల మేర గండి పడుతోంది. విజయవాడ వన్‌టౌన్ కేంద్రంగా జరుగుతున్న ఈ వ్యాపారంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఇటీవల వారు జరిపిన సోదాల్లో... సిగిరెట్ల స్మగ్లింగ్ గుట్టు బయటపడింది.
భారత్ సరిహద్దు దేశాలైన బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి... ఈ నిషేధిత సిగరెట్లు ఈశాన్య రాష్ట్రాలకు చేరుతున్నాయి. వస్త్రాలు, గృహోపకరణాలు, కూరగాయలు, నిత్యావసరాల సరకులతోపాటు... వీటిని ఈశాన్య రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఆ రాష్ట్రాల్లో నిఘా తక్కువగా ఉండటం కారణంగా... మిగిలిన రాష్ట్రాలకు సులువుగా తరలిస్తున్నారు. ఇదే మార్గంలో విజయవాడకు నిషేధిత సిగరెట్లు గుట్టుగా సరఫరా అవుతున్నాయి. కోల్‌కతాలో సరకు బయలుదేరింది మొదలు... ఇక్కడికి చేరే వరకు వ్యాపారులు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటారు.
పార్సిల్ గమ్యానికి చేరగానే... నిమిషాల వ్యవధిలో తీసుకుంటున్నారు. అనంతరం గొల్లపూడి, వన్‌టౌన్‌లోని హోల్‌సేల్ దుకాణాలకు తరలిస్తున్నారు. అప్పటికే పదుల సంఖ్యలో సిద్ధంగా ఉండే డెలివరీ బాయ్స్... ద్విచక్రవాహనాల ద్వారా చిల్లర దుకాణాలకు చేరుస్తున్నారు. వన్‌టౌన్, భవానీపురం, గొల్లపూడి, మాచవరం, కంకిపాడు తదితర ప్రాంతాల్లోని చిల్లర దుకాణాల్లో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్రాండెడ్ సిగరెట్ల ధర అధికంగా ఉంటుంది. వీటి అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయలు పన్నుల రూపంలో వస్తాయి.
అక్రమంగా విక్రయిస్తున్న సిగరెట్లను మాత్రం పెట్టె 10 నుంచి 30 రూపాయలకే విక్రయిస్తున్నారు. ఎక్కువ మంది వీటి కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. ఈ నిషేధిత సిగరెట్లు ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. తయారైనప్పటి నుంచీ 3 నెలల వ్యవధిలో మాత్రమే వీటిని వాడాల్సి ఉంటుంది. ఆ తరువాత అందులోని నికోటిన్ విషపూరితంగా మారుతుందని, సిగరెట్లలో ఫిల్టర్లు లేకపోవడం కారణంగా... ఘనవ్యర్థాలు నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి ప్రమాదకరమైన రోగాలకు కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో... ఈ ఏడాది ఆగస్టులో... దాదాపు రూ.20 లక్షల విలువైన నిషేధిత సిగరెట్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ ఒక్క రోజులోనే దీనికి రెట్టింపు సరకు విజయవాడలో అమ్ముతారని దర్యాప్తులో తేలింది.
ఇదీ చదవండీ...తిరుమల అన్యమత వివాదంపై ఆర్టీసీ చర్యలు