రాష్ట్రంలోని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ కళాశాలల్లో బీఎస్సీ, ఎంఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్ డిప్లమో కోర్సులకు ఫీజులను నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసింది. 2020-21 విద్యా సంవత్సరంలో నిర్ధారించిన ఫీజులే 2021-22, 2022-23 విద్యా సంవత్సరాలకు వర్తిస్తాయని వైద్యారోగ్య శాఖ పేర్కొంది. ఇందులో ట్యూషన్, అఫిలియేషన్, ఐడెంటిటీ కార్డు జారీ, క్రీడలు, సాంస్కృతిక అంశాలు, కంప్యూటర్, ఇంటర్నెట్ వినియోగం తదితర ఫీజులు ఇమిడి ఉంటాయని తెలిపింది. కన్వీనర్ కోటాలో హాస్టల్ , మెస్, రవాణా లాంటి ఖర్చులు ఇమిడి ఉండవని స్పష్టం చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన దాని కన్నా అదనంగా కళాశాల యాజమాన్యాలు ఫీజులు వసూలు చేయడానికి వీలులేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు, కడప, విశాఖ, గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని నర్సింగ్ కళాశాల్లో కన్వీనర్ కోటా కింద రూ. 18 వేలుగా నిర్ధారించారు. బీఎస్సీ నర్సింగ్ ఫీజును మేనేజ్ మెంట్ కోటా కింద రూ. 80 వేలుగా పేర్కొన్నారు. కర్నూలులోని కళాశాలల్లో ఎంఎస్సీ నర్సింగ్ కోసం.. కన్వీనర్ కోటా కింద రూ. 83 వేలు, మేనేజ్మెంట్ కోటా కింద రూ. లక్షా 49 వేలుగా ఫీజులను నిర్ధారిస్తూ ఉత్తర్వులను విడుదల చేశారు. ఒంగోలులోని కళాశాలల్లో బ్యాచిలర్ అఫ్ ఫిజియో థెరపీ (బీపీటీ) కోర్సుకు.. కన్వీనర్ కోటా కింద రూ. 18 వేలు, మేనేజ్మెంట్ కోటా కింద రూ. 80 వేలుగా పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఎస్‌ఈసీ రిట్ అప్పీల్ పిటిషన్.. విచారణ 18కి వాయిదా