POWER BILLS PENDING ISSUE IN LOK SABHA: రెెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విద్యుత్ బకాయిల విషయంలో అసలుపై ఎలాంటి పేచీ లేదని, వడ్డీ విషయంలో మాత్రమే వివాదం నడుస్తోందని కేంద్ర విద్యుత్ శాఖ లోక్ సభలో వెల్లడించింది. లోక్ సభలో వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు.. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రూ.6,111.88 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జులై 14న తమకు లేఖ రాసినట్లు పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాధికారులతో జరిగిన సమావేశంలో.. కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి వెల్లడించారు. ఈ అంశం రాష్ట్ర విభజన అనంతరం వచ్చిందని.. ఇరు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారమే విద్యుత్ సరఫరా జరిగిందని.. ఈ మేరకు తెలంగాణ ప్రాథమిక చెల్లింపులు చేసినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణకు.. ఏపీ సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి చెల్లించాల్సిన అసలు మొత్తంపై ఎలాంటి వివాదమూ లేదని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి.. వడ్డీని కొంత సవరించాల్సి ఉందని చెప్పారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలోని షరతులను అనుసరించి.. ఆ అంకెలను సవరించడానికి ఇరు రాష్ట్రాలు అంగీకరించాయని కేంద్ర మంత్రి వెల్లడించారు.
తెలంగాణ నుంచి వసూళ్లు రాకపోవడంతో.. ఏపీ ప్రభుత్వం దీనిపై తెలంగాణ హైకోర్టులో కేసు దాఖలు చేసినట్లు ఆర్‌కే సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉందన్న విద్యుత్ శాఖ మంత్రి.. ద్వైపాక్షిక ఒప్పందాన్ని అనుసరించి విద్యుత్ సరఫరా చేసినందున సమస్యను పరస్పరం సామరస్యపూర్వకంగా చర్చించుకోవాలని ఇప్పటికే సూచించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:
ERC ON TRUE UP CHARGES: విద్యుత్ వినియోగదారులకు ఊరట.. ట్రూ అప్ ఛార్జీలపై కీలక నిర్ణయం