తెలంగాణ ప్రభుత్వం.. మంత్రి ఈటల రాజేందర్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆయనపై వచ్చిన భూ ఆక్రమణల ఆరోపణలపై విచారణకు ఆదేశించిన కేసీఆర్ ప్రభుత్వం.. తాజాగా ఆయన నుంచి వైద్య ఆరోగ్య శాఖను తప్పించింది. ఆ శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతికి వెళ్లింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అత్యంత సున్నితమైన ఈ శాఖను.. ఇకపై కేసీఆర్ నిర్వహించబోతున్నారు. ఈ మేరకు.. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదముద్ర వేసినట్టు అధికారిక ప్రకటన విడుదలైంది.
శుక్రవారం మంత్రి ఈటలపై కొందరు మెదక్ జిల్లాకు చెందిన రైతులు సీఎంకు ఫిర్యాదు చేయటం, దానిపై కేసీఆర్ వెంటనే విచారణకు ఆదేశించటం చకచకా జరిగిపోయాయి. వివాదానికి కేంద్రంగా నిలిచిన మాసాయిపేట, హకీంపేట అసైన్డ్ భూముల్లో రెవిన్యూ, విజిలెన్స్ అధికారులు ఉదయం నుంచి విచారణ చేస్తున్నారు. ఈ రోజే సీఎంకు ఆ భూములపై నివేదిక అందించే అవకాశం ఉంది.
తనపై జరుగుతున్న ప్రచారాన్ని.. నిన్న రాత్రి తన నివాసంలో తీవ్రంగా ఖండించిన ఈటల రాజేందర్.. ఈరోజు తన నివాసంలోనే ఉండి తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలతో తాజా పరిణామాలపై మాట్లాడారు. ఈటలపై జరుగుతున్నదంతా కుట్రగా అభివర్ణిస్తూ ఆయన వర్గీయులు ఈ ఉదయం కాసేపు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. ఈటల సొంత నియోజకవర్గం హుజురాబాద్‌లోనూ నిరసనలు చేపట్టారు.
ఇదీ చదవండి:
ప్రాణాలకే భరోసా లేదు.. భవిష్యత్ గురించి ఏం ఆలోచిస్తారు?: చంద్రబాబు