Teacher MLCs fires on YSRCP Government: ఉపాధ్యాయులంతా సీపీఎస్ రద్దు కోసం పోరాడి తీరుతారని టీచర్ ఎమ్మెల్సీలు తేల్చిచెప్పారు. ఉద్యోగుల అక్రమ నిర్బంధాలకు నిరసనగా సెప్టెంబర్ ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జిల్లా, మండల స్థాయిల్లోనూ తమ నిరసనలు ఉంటాయన్న ఎమ్మెల్సీలు.. అక్కడ కూడా నిర్బంధిస్తే కుటుంబసభ్యులతో ఆందోళనలు చేయిస్తామని హెచ్చరించారు.
ఉపాధ్యాయులపై బైండోవర్ కేసులు పెట్టడం.. పోలీస్స్టేషన్లకు పిలిపించి వేధించటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షన్నర ఉపాధ్యాయులతో పాటు వారి కుటుంబాల ఓట్లు ముడిపడి ఉన్నాయనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను ప్రశ్నిస్తే రాజకీయ దాడిగా తీసుకోవటం తగదన్నారు. హక్కుల కోసం నిరసన తెలుపుతుంటే కక్ష సాధింపు చర్యలకు దిగటం దుర్మార్గమైన చర్యని దుయ్యబట్టారు. ఉపాధ్యాయులు వినాయక చవితి పండుగ చేసుకోకూడదు.. పాఠశాలలకు కూడా వెళ్లొద్దంటూ స్టేషన్లకు పిలిపించి కూర్చోపెట్టడమేంటని ఆక్షేపించారు.
బ్రిటీష్ కాలంలో కూడా ఈ తరహా నిర్బంధాలు ఉద్యోగులు ఎదుర్కోలేదని వాపోయారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీనే అడుగుతున్నామని.. ఎన్నికల హామీలో పెట్టకుండానే రాజస్థాన్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు సీపీఎస్ రద్దు చేశాయని గుర్తు చేశారు. సీపీఎస్ రద్దు చేయకుంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఒపీఎస్ పునరుద్ధరణ కోసం ఉద్యోగుల వెంట ఉద్యమిస్తామన్నారు.
petition to DGP: డీజీపీకి వినతి: డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు వినతిపత్రం అందజేశారు. నిర్బంధించిన ఉద్యోగులను, వారి వాహనాలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సీపీఎస్ రద్దు ఉద్యమం పేరిట ఉద్యోగులు, టీచర్ల నిర్బంధించారని ఎమ్మెల్సీలు తెలిపారు. ఈ అంశంపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: