ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో ప్రపంచం స్తంభించిపోయినట్లు ఉందని సినీనటి, తెదేపా అధికార ప్రతినిథి దివ్యవాణి అన్నారు. 'పెళ్లి పుస్తకం' సినిమాలో ఆయన పాడిన పాటలు తనకు బహుమతి లాంటివని పేర్కొన్నారు. 'దోషి' సినిమాలో బాలు గారు తన నాన్నగా నటించారని గుర్తుచేసుకున్నారు. హృదయం ఏడవడం అంటే ఏమిటో ఎస్పీబీ మృతితో తెలుస్తోందన్నారు. ఆయనతో ఎదురుగా ఉండి పాటలు పాడించుకున్న మధుర జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు.
ఎంతో మంది ప్రతిభ ఉన్న గాయకులను బయటకు తీసుకొచ్చారని కొనియాడారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆ స్వరం ఈ ప్రపంచమంతా ఉందని చెప్పారు. బాలు మరణం చిత్రసీమకు తీరని లోటని అభిప్రాయపడ్డారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బాలు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.