Yanamala Ramakrishnudu on CM jagan: లంచాలు తీసుకోవడం నేరమని జగన్ మాట్లాడటం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ అని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్ రెడ్డి సామాజిక న్యాయం మాటలకే పరిమితమైపోయిందని.. ఆచరణలో ఏ ఒక్కరికీ న్యాయం చేయలేకపోయారని మండిపడ్డారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేసిన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్‌లో దేశంలోనే ఏపీ 20వ స్థానంలో ఎందుకుందని ప్రశ్నించారు. ఆర్ధిక అసమానతలలో రాష్ట్రం 34వ స్థానం నుంచి 43కు ఎందుకు పడిపోయిందని నిలదీశారు. ప్రత్యక్ష నగదు బదిలీలో రాష్ట్ర ర్యాంకు 19వ స్థానానికి ఎందుకు దిగజారిందో జగన్ చెప్పగలరా ? అని సవాల్ విసిరారు.
మూడేళ్ల జగన్ పాలనలో విద్యారంగం పతనావస్థకు చేరుకుందన్నారు. కేంద్ర విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన నేషనల్ ఎచీవ్‌మెంట్ సర్వే 2021 రిపోర్టుతో రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఎంతగా దెబ్బతిందో బట్టబయలైందని విమర్శించారు. జగన్ విధానాలతో దళిత, గిరిజన, బలహీన వర్గాల పిల్లల భవిష్యత్ నాశనం అవుతోందని ఆక్షేపించారు. ఏడాదికి దాదాపు రూ. 57 వేల కోట్లను దారిమళ్లించి ఈ వర్గాలను జగన్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. తెదేపా హయాంలో తలసరి ఆదాయం రెండంకెల్లో ఉంటే.. గత మూడేళ్లలో 1.03 శాతానికి పతనమైందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో స్థిరధరల ప్రకారం జీఎస్డీపీ రెండంకెల వృద్ధి ఉంటే.. వైకాపా పాలనలో నెగటివ్‌కు దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడు ఘనవిజయంతో వైకాపా నాయకుల్లో భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. దావోస్ పర్యటనతో రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏంటో చెప్పకుండా ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించేందుకు జగన్ రెడ్డి లంచం అంశం మాట్లాడుతున్నారని యనమల మండిపడ్డారు.
Somireddy on ACB APP: వైకాపా నేతలు బహిరంగంగా అవినీతి చేస్తుంటే.. యాప్ పేరుతో సీఎం కామెడీ చేస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. అవినీతి ఆరోపణలు వచ్చిన సొంత పార్టీ నేతలపై ఏం చర్యలు తీసుకున్నారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. 'అవినీతిలో పుట్టిన పార్టీ ద్వారా.. అవినీతి నిర్మూలన ఎలా సాధ్యమని వైకాపా నేతలే విమర్శలు చేస్తున్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు లంచం ఇవ్వటం, తీసుకోవటం నేరం అంటూ యాప్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. రూ. 43వేల కోట్ల అవినీతికి పాల్పడినట్లు సీబీఐ నిర్ధరించిన వ్యక్తి.. అవినీతి నిర్మూలన గురించి మాట్లాడటం విడ్డురంగా ఉంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రభుత్వ అండ లేకుండా ఎవరైనా మైనింగ్ చేయగలరా?. ఇసుక అక్రమాల గురించి బొల్లా బ్రహ్మానాయుడు, విత్తన అక్రమాల గురించి ఆర్కే మాట్లాడలేదా.. కృష్ణపట్నం పోర్టులోకి లారీలు వెళ్లాలంటే కాకాణికి టోల్ కట్టాలి. యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులన్నింటినీ బహిర్గతం చేయాలి' అని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: