పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ.. గుంటూరులో తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. శంకర్ విలాస్ కూడలిలో లాంతర్లు అమ్ముతూ నిరసన తెలిపారు. వైకాపా పాలనలో సామాన్యుడు జీవించడమే కష్టతరంగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు రాని యువత కోసం.. లాంతర్లు అమ్ముకునే కొత్త పథకం ప్రవేశపెట్టారంటూ ఎద్దేవా చేశారు.
విద్యుత్ ఛార్జీల వాతను నిరసిస్తూ.. కడప జిల్లా రైల్వేకోడూరులో తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహప్రసాద్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. లాంతర్లు, విసనకర్రలు అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు. ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లకు బదులు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద విసనకర్రలు, లాంతర్లు అందించారు. తెలుగుదేశం పాలనపై అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన జగన్.. ఇప్పుడు ధరలు పెంచుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ.. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం శ్రేణులు ఆందోళన చేపట్టారు. విసనకర్రలతో విసురుకుంటూ జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలంటూ ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం.. పట్టాలు తప్పిన 10 బోగీలు