విజయవాడలో తెదేపా నేతల మధ్య తలెత్తిన విభేదం సద్దుమణిగింది. విషయం తెలిసిన వెంటనే తెదేపా అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి సమస్య పరిష్కారంపై దృష్టి సారించారు. ఆయన ఆదేశాల మేరకు నేతలు బొండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనార్దన్, వర్ల రామయ్యలు మాట్లాడారు. విజయవాడ తెదేపా మేయర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కేశినేని శ్వేతకు మద్దతిస్తూ, ఆమె వెంటే ఉంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని నేతలు హామీ ఇచ్చారు. ఆమె విజయానికి కృషి చేస్తామని ముగ్గురు నేతలు వెల్లడించారు.
బొండా ఉమ ఇంటికి కేశినేని శ్వేత..
నేతల మధ్య నెలకొన్న వివాదం సమసిన కొన్ని గంటల వ్యవధిలోనే విజయవాడ తెదేపా మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత.. విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు నెట్టం రఘురాంను వెంట బెట్టుకుని బొండా ఉమ ఇంటికి వెళ్లారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో తనకు సహకరించాల్సిందిగా బొండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలను కోరారు. శ్వేతతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని నేతలు స్పష్టం చేశారు. విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో పర్యటించి.. తెదేపా అభ్యర్థి విజయమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. మేయర్ అభ్యర్థి విజయానికి శాయశక్తులా కృషి చేస్తామన్నారు.
నగర పార్టీలో సమన్వయ లోపం ఉన్న మాట వాస్తవమేనని అదే అసంతృప్తికి దారి తీసిందని నెట్టం రఘురామ్ వెల్లడించారు. కుటుంబంలో ఉన్న విభేదాలే తప్ప తమ మధ్య వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టం చేశారు. లోపాలు పరిష్కరించుకుని ఒకే జట్టుగా ముందుకు సాగుతామన్నారు.
ఇదీ చదవండి: టీ కప్పులో తుపాను...వివాదం సమసిపోయిందంటున్న తెదేపా నేతలు