నాటుసారా మరణాలపై ఉభయసభల్లో చర్చించేదాకా.. ఆందోళన ఆపేది లేదని తెలుగుదేశం శాసనసభాపక్షం స్పష్టం చేసింది. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లారు. జే బ్రాండ్‌తో.. జగన్ రెడ్డి జనాల ప్రాణాలు తీస్తున్నారని ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రాన్ని జే బ్రాండ్ మద్యం, కల్తీసారా, గంజాయి, నార్కోటిక్స్ డ్రగ్స్ ముంచెత్తుతున్నాయని నేతలు మండిపడ్డారు. కరోనా మరణాలతో పోటీగా కల్తీ నాటు సారా మరణాలు చోటు చేసుకుంటున్నాయని నినాదాలు చేశారు.
కల్తీ సారా మరణాలపై ప్రశ్నిస్తే అన్యాయంగా తెలుగుదేశం సభ్యుల్ని సస్పెండ్ చేశారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రజా సమస్య పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. దోచుకోవాలి, దాచుకోవాలి అన్నట్లుగా ప్రభుత్వ వైఖరి ఉందని దుయ్యబట్టారు. నాటుసారాపై అసెంబ్లీలో అసత్య ప్రకటన చేసిన సీఎం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
"ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. నాటుసారాతో ప్రజల ప్రాణాలు పోతుంటే పట్టించుకోవట్లేదు." -అశోక్‌బాబు ,తెదేపా ఎమ్మెల్సీ
"నాటుసారా, జే బ్రాండ్ మద్యం వల్ల 40 మందికి పైగా చనిపోయారు. దోచుకోవాలి, దాచుకోవాలి అన్నట్లుగా ప్రభుత్వ వైఖరి ఉంది." -బీటీ నాయుడు, తెదేపా నేత
బాధితులకు న్యాయం జరిగేవరకు వదిలిపెట్టం..
మార్షల్స్‌ను అడ్డుపెట్టుని అసెంబ్లీని నడుపుతున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యేలు మండిపడ్డారు. జంగారెడ్డిగూడంలో నాటుసారా మరణాలపై చర్చకుపట్టుబడితే.. నాలుగోరోజూ సభ నుంచి సస్పెండ్ చేశారని ఆక్రోశించారు. నాటుసారాతో ప్రాణాలు పోతుంటే సీఎం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. కల్తీసారాపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదవుతున్నా సహజ మరణాలంటారా ? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. బాధితులకు న్యాయం జరిగేవరకు వదిలిపెట్టేది లేదని సీఎం జగన్‌ను హెచ్చరించారు.
ఇదీ చదవండి