Nakka Anand babu on Ysr Bheema: వైఎస్సార్ ఉచిత పంటల బీమా చెల్లింపు.. జగన్ రెడ్డి అంత:పుర రహస్యంలా మారిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు అన్నారు. సీఎం జగన్.. అయన కిందిస్థాయి అనుచరులు పంట పరిహారం, బీమా సొమ్ముల్ని దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు పంచుకుంటున్నారని ఆరోపించారు. రైతు పేరు మీద ఏ విధంగా దోచుకోవచ్చో.. కొత్త విధానాలకు జగన్ రెడ్డి శ్రీకారం చుట్టారని ఆయన మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో సెంటు భూమి లేనివారికి రూ. 1.80లక్షల బీమా ఎలా అందిందని నిలదీశారు. గ్రామం యూనిట్‌గా ఎవరెవరికి బీమా సొమ్ము చెల్లించారో ఆ వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వైకాపా నేతలు దోచుకుతిన్నట్లే భావించాల్సి వస్తుందన్నారు. గతంలో వాతావరణ పరిస్థితుల వల్ల నష్టపోయే రైతులు.. ఇప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యంతో నష్టపోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లాలో మంత్రులు పెద్దిరెడ్డి, రోజా, ఎమ్మెల్యేలు కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి సహా వైకాపా నాయకులంతా అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం ఆరోపించింది. ఆర్టీసీ వైస్ ఛైర్మన్ విజయానందరెడ్డి, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేంద్రరెడ్డి, వారి బంధువులు అడ్డూఅదుపూ లేకుండా కబ్జాలు చేస్తున్నా.. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే చిత్తూరు జిల్లాలో మైనింగ్, ఇసుక, ఖాళీ స్థలాలు, మద్యం, ఎర్రచందనం అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెదేపా నేత పట్టాభి డిమాండ్ చేశారు.
సంక్షేమ పథకాలను కత్తెర పథకాలుగా ముఖ్యమంత్రి జగన్ మార్చారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష విమర్శించారు. అమ్మ ఒడి మొదలు.. దళితులకు ఇచ్చే విద్యుత్ రాయితీల్లో మోసాలకు పాల్పడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. తెదేపా హయాంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నిలుపుదల చేసి అన్ని వర్గాల ప్రజలను సీఎం మోసం చేశారని దుయ్యబట్టారు. జగన్‌కి నాలుగు ప్రాంతాల్లో ఇళ్లు ఉండొచ్చు కానీ.. ఆయన్ను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించిన ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఒక్క ఇల్లు మాత్రమే ఉండాలంటున్నారని ఆమె మండిపడ్డారు.
ఇదీ చదవండి: