బడుగు, బలహీన వర్గాలకు దయాదాక్షిణ్యంతో పదవులు ఇవ్వడం లేదని.. ప్రభుత్వంపై తెదేపా మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీశ్వరరావు మండిపడ్డారు. సలహాదారులు, ముఖ్యమైన నామినేటెడ్ పదవుల్లో.. సామాజిక న్యాయం ఏమైందని నిలదీశారు. కార్యాలయాలు, అధికారాలు లేని కార్పొరేషన్ పదవులను బలహీన వర్గాలకు ఇచ్చి.. ప్రధాన పదవులను సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టడం సామాజిక న్యాయం ఎలా అవుతందని ప్రశ్నించారు. సామాజిక న్యాయం పాటించామని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం తప్ప.. పదవులు పొందిన వారి నోటి నుంచి రావడం లేదని ఆరోపణలు చేశారు. పెద్ద పదవులకు బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అర్హులు కాదా అని ధ్వజమెత్తారు. బడుగు, బలహీన వర్గాలకు అధికారం కోసం తెదేపా పోరాడుతుందని ఆయన వెల్లడించారు.
మతాల మధ్య చిచ్చుపెట్టడం మానుకోవాలి
మతాల మధ్య చిచ్చుపెట్టడాన్ని వైకాపా నేతలు మానుకోవాలని.. తితిదే మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ధ్వజమెత్తారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన వైకాపా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి.. బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా జగన్రెడ్డి.. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధికి యత్నించారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో మతసామరస్యాన్ని కాపాడిన ఘనత చంద్రబాబుదని గుర్తుచేశారు.
సామరస్యంగా ఉంటున్న మతాల మధ్య వైకాపా చిచ్చు పెట్టేందుకు యత్నించడం దురదృష్టకరమని మండిపడ్డారు. జగన్ రెడ్డి రెండేళ్ల పాలనలో.. దేవాలయాలపై సుమారు 200 దాడులు, విగ్రహాల విధ్వంస ఘటనలు జరిగాయని విమర్శించారు. దేవాలయాల విధ్వంసాలకు పాల్పడిన వారిని శిక్షించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి:
polavaram: పోలవరానికి పోటెత్తుతున్న వరద..భయాందోళనలో ముంపు మండలాలు