రాష్ట్ర ఇరిగేషన్ చరిత్రలో గుర్తు పెట్టుకోవాల్సిన రోజును ప్రభుత్వం గాలికొదిలేసిందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎంత వరకు పూర్తయ్యిందో చెప్పే పరిస్థితిలో లేరని, హంద్రీనీవా పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని విమర్శించారు. సంగం బ్యారేజీ పనులపై నోరు విప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సామాన్యులకు ఇసుక అందని ద్రాక్షలా మారిందని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి...
మహిళలకు భద్రత కల్పించలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరం లేదని, జగన్ రెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. అత్యాచార బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవటం దుర్మార్గమమని, మృగాళ్ల దురాగతాలను హోం మంత్రితో పాటు ప్రభుత్వపెద్దలు, సలహాదారులు సమర్థిస్తుండటం హేయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని దిశ చట్టంపై సమీక్షలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి బాధితుల వద్దకు వెళ్లి ఎందుకు మాట్లాడలేకపోతున్నారని నిలదీశారు. అఘాయిత్యాలకు గురైన ఆడబిడ్డల పరామర్శకు వెళ్తున్న తెదేపా నేతల్ని అడ్డుకోవటంపై పెడుతున్న శ్రద్ధలో సగం కూడా పోలీసులు మహిళల రక్షణ కోసం పెట్టట్లేదని దుయ్యబట్టారు.
నిధులు కేటాయించాలి...
తెదేపా హయాంలో బ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్‌ను వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్వీర్యం చేసిందని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ... విజయవాడ ధర్నా చౌక్‌లో బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బ్రాహ్మణులకు వైకాపా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే బ్రాహ్మణ కార్పొరేషన్ కు ఇస్తానన్న నిధులు ఇవ్వాలని... లేదంటే రాష్ట్రవ్యాప్తంగా తెదేపా ఆధ్వర్యంలో బ్రాహ్మణుల సంక్షేమానికై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇదీచదవండి.