నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టు ఒప్పందం ప్రకారం పరికరాలన్నీ సక్రమంగా ఉన్నాయని ఆ సంస్థ అధికారులు స్టాక్‌రిజిస్టర్‌లో సంతకాలు చేశారని, అలాంటప్పుడు ఓ తప్పుడు ఫిర్యాదుపై సీఐడీ అధికారులు కేసు ఎలా నమోదు చేస్తారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రశ్నించారు. తమ ప్రాంగణాల్లోని నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో అన్ని పరికరాలు ఉన్నాయని.. సీమెన్స్, డిజైన్‌టెక్ సంస్థలు సక్రమంగా అప్పగించాయంటూ ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు ఈ ఏడాది ఆగస్టులో నైపుణ్యాభివృద్ధి సంస్థ సీఈవోకు లేఖలు రాశాయని వివరించారు. అవి చూశాక కూడా అసలు పరికరాలే ఇవ్వలేదని, తప్పుడు ఇన్‌వాయిస్‌లు సృష్టించారంటూ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అజయ్‌రెడ్డి ఎలా ఫిర్యాదు చేశారని నిలదీశారు. ఫోరెన్సిక్ ఆడిటింగ్‌లో భౌతిక పరిశీలన చేపట్టాలన్న నిబంధనను ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. భౌతిక పరిశీలన చేస్తే తెదేపా ప్రభుత్వంపై బురదజల్లేందుకు వీలు కాదనేది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్ని పరికరాలు సక్రమంగా ఉన్నాయంటూ స్టాక్‌రిజిస్టర్లలో నైపుణ్యాభివృద్ధి అధికారులు సంతకాలు చేసిన పత్రాలు.. ఒప్పందం ప్రకారం సీమెన్, డిజైన్‌టెక్ సంస్థలు పరికరాలు అప్పగించాయంటూ విద్యాసంస్థల యాజమాన్యాలు రాసిన లేఖల ప్రతులను ఆయన మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ‘ఒప్పందం ప్రకారం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటుచేశాక మూడేళ్లపాటు వాటిని డిజైన్‌టెక్ సంస్థ నిర్వహించాలి. ఆ తర్వాత ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలకు అప్పగించాలి. ఈ సందర్భంలో కేంద్రాల్లోని స్టాకు పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్నాయంటూ ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు నైపుణ్యాభివృద్ధి సంస్థ సీఈవోకు ఈ ఏడాది ఆగస్టు 5, 6 తేదీల్లో లేఖలు రాశాయి. ఇవి సీఐడీకి కనిపించలేదా? లేఖలు చూశాక కూడా అంతా బోగస్ అని, కోట్లు మింగేశారని ఎలా అంటారు? సీఎం స్వస్థలమైన ఇడుపులపాయలో రాజీవ్ ఐఐఐటీ ఉంది. ఒప్పందం ప్రకారం పరికరాలన్నీ అందినట్లు వారు కూడా నైపుణ్యాభివృద్ధి సంస్థకు లేఖ రాశారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న జగన్ అక్కడికెళ్లి పరికరాలున్నాయో లేదో పరిశీలించవచ్చు. ఆయా కేంద్రాల్లో క్షుణ్ణంగా పరిశీలించాక అన్నీ సక్రమంగా ఉన్నాయని స్టాక్‌రిజిస్టర్‌లో నైపుణ్యాభివృద్ధి అధికారులు సంతకాలు చేశారు. తెదేపా ప్రభుత్వంపై బురదజల్లేందుకే తప్పుడు ఫిర్యాదులు చేశారనేందుకు, సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ బోగస్ అని చెప్పేందుకు ఈ ఆధారాలే సాక్ష్యం.
నోటీసులిచ్చి విచారించాలి
నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టుపై తప్పుడు ఫిర్యాదు ఇచ్చినందుకు ఆ సంస్థ ఛైర్మన్ అజయ్‌రెడ్డి, సలహాదారు చల్లా మధుసూదన్‌రెడ్డిలకు సీఐడీ నోటీసులిచ్చి విచారించాలి. తప్పుడు ఎఫ్‌ఐఆర్‌పై సీఐడీ అధికారులు సమాధానం చెప్పాలి. వాస్తవాలను, ఆధారాలను పరిగణనలోకి తీసుకోకుండా కేసు ఎలా నమోదు చేశారన్నది న్యాయస్థానం ముందుంచుతాం’ అని వెల్లడించారు.
ఇదీ చదవండి: