తెదేపా హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను.. వైకాపా ప్రభుత్వం అకారణంగా నిలిపివేస్తోందని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిరామ్ మండిపడ్డారు. ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుపై.. వైకాపా నేతల అసత్య ఆరోపణలు సరికాదన్నారు. రూ.770కోట్లు విలువ చేసే ప్రాజెక్టులో.. 2వేల కోట్ల అవినీతిని తెలుగుదేశం ప్రభుత్వం ఎలా చేసిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
"ఏపీ ఫైబర్ నెట్లో మంచి అంశాలను ప్రధాని మోదీని అడిగితే అందులో గొప్ప విషయాలు చెప్తారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన డిజిటల్ ఇండియా ప్రాజెక్టుకు.. ఏపీ ఫైబర్ నెట్ ను ఆదర్శంగా తీర్చిదిద్ది భారత ప్రధాని ప్రశంసలు పొందింది. వేలాది గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు, అనేక ప్రభుత్వ శాఖలకు మెరుగైన ఆన్లైన్ సేవలు ఏపీ ఫైబర్ నెట్ ద్వారానే అందుతున్నాయి. మార్చి 2019 నాటికి 10లక్షల కనెక్షన్ల ద్వారా ప్రభుత్వానికి ఫైబర్ నెట్ రూ.70కోట్ల ఆదాయం తెచ్చిపెట్టింది. ప్రతి నెలా రూ.10కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం తెస్తున్న ఫైబర్ నెట్ ప్రాజెక్టుపై.. దుష్ప్రచారాలను సహించం. 25వేల కిలోమీటర్ల మేర కేబుల్ వ్యవస్థను తెదేపా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని చెప్పగలరా. అతి తక్కువ ధరతో సామాన్యులకు ఇంటర్నెట్ తో పాటు కేబుల్, టెలిఫోన్ సౌకర్యం కల్పించే ట్రిపుల్ ప్లే ప్రాజెక్టు దేశంలో మరే రాష్ట్రంలో లేనప్పుడు ఏపీలో అమలైంది. గతంలో చంద్రబాబు రూపొందించిన స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్కింగ్ (స్వాన్) ప్రాజెక్టు నుంచి ఆదర్శంగా తీసుకున్న ఫైబర్ నెట్ ప్రాజెక్టును చంపే ప్రయత్నం చేసినా, బురదచల్లినా సహించేది లేదు" అని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
Nominated posts: ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల ప్రకటన.. అతివకే అందలం