అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ ఆశ పెట్టిన జగన్... నిరుద్యోగ యువతను బలితీసుకుంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల పాలనలో 300 నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నా.. వైకాపా ప్రభుత్వంలో చలనం లేదని దుయ్యబట్టారు. ఉద్యోగాల భర్తీ కోరుతున్న యువతతో కలిసి పోరాటం చేస్తామని లోకేశ్ అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేసేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు.
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం చనుగొండ్ల గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకుడు గోపాల్ మృతి తీవ్రంగా కలచివేసిందని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. గోపాల్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గోపాల్ కుటుంబానికి జరిగిన అన్యాయం మరే కుటుంబానికి జరగకుండా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. త్వరలోనే చనుగొండ్ల వెళ్లి గోపాల్ తల్లిదండ్రులను కలుస్తానని వెల్లడించారు.
ఇదీ చదవండి:
Mopidevi: 'ఏపీకి వ్యతిరేకంగా తెలంగాణలో నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోం'