మంత్రిగా ఆదిమూలపు సురేశ్ రూ.1846 కోట్ల అవినీతికి పాల్పడ్డారని తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్ రాజు ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ జాబితాను విడుదల చేశారు. ప్రపంచ అవినీతి మూలవిరాట్ జగన్ రెడ్డి కేబినెట్లో ఆదిమూలపు సురేశ్ మరో అవినీతి తిమింగళమని విమర్శించారు. ప్రకాశం జిల్లాలో వందల ఎకరాల అసైన్డ్ భూముల్ని అన్యాక్రాంతం చేస్తూ.. ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తూ వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. అవినీతి, కబ్జాలు, హత్యల్లో ఆదిమూలపు సురేశ్‌కు ప్రమేయం ఉందని ఆరోపించారు. జగన్ రెడ్డి 420 అయితే సురేశ్ 840లా ఉన్నారని దుయ్యబట్టారు. నాడు-నేడు పథకంలో కమీషన్ల రూపంలో రూ.340 కోట్లు, టీచర్ల బదిలీల్లో రూ.75 కోట్లు లంచాలు, కోడిగుడ్ల కాంట్రాక్ట్‌లో కమీషన్ కింద రూ.300 కోట్లు, పల్లీ చీక్కీల్లో రూ. 200 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
మార్కాపురంలో జార్జ్ ఇంజనీరింగ్ కాలేజీ పేరుతో రూ.65 కోట్ల విలువైన 90 ఎకరాల భూమిని కబ్జా చేశారన్నారు. పుల్లల చెరువులో 289 ఎకరాల అసైన్డ్ భూముల ఆక్రమణలో 30 కోట్లు, గిద్దలూరులో 327 ఎకరాలు ఆక్రమణతో రూ.40 కోట్లు, త్రిపురాంతకంలో 365 ఎకరాల ఆక్రమణతో రూ.55 కోట్లు, ద్వార్నాలలో 205 ఎకరాల ఆక్రమణతో రూ.20 కోట్లు, పెద్దారవీడులో 330 ఎకరాల ఆక్రమణతో రూ.35 కోట్లు, ఎర్రగొండపాలెంలో అసైన్డ్ భూముల ఆక్రమణతో రూ.40 కోట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి A-ట్యాక్స్ రూ.85 కోట్లు, ఇళ్ల పట్టాల పంపిణీల్లో రూ.10 కోట్లు, ఇసుక డంపింగ్ యార్డు ద్వారా రూ.300 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. విద్యాశాఖలో జరిగిన అవినీతిని చర్చించడానికి ఆధారాలతో సహా సిద్ధంగా ఉన్నామన్నారు.
ఇదీ చదవండి: 25 మందితో కొత్త కేబినెట్.. జగన్ టీమ్ ఇదే !