విశాఖ స్టీల్ ప్లాంట్‌ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి లేఖ రాశారు. "ఛత్తీస్‌గఢ్‌లోని నాగర్నార్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తెరపైకి వస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిందని.. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలోనూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలన్నారు.
స్టీల్ ప్లాంట్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్న లక్షలాదిమందికి భరోసా కల్పించాలి. ఇంత పెద్ద ఉక్కు పరిశ్రమకు సొంత కాప్టివ్ ఐరన్ ఓర్ ఖనిజ వ్యవస్థ లేకపోవడం వల్లే నష్టాలు వస్తున్నాయి. సొంత ఐరన్ మైన్‌ని కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చెయ్యాలి. 2032కి దేశంలోనే అతి పెద్ద స్టీల్ ఉత్పత్తి చేసే పరిశ్రమగా అభివృద్ధి చెందనున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడం రాష్ట్రానికి ఎంతో అవసరం.
ఎంతోమంది త్యాగాలతో ఏర్పాటైన ప్లాంట్‌ను స్వార్ధప్రయోజనాల కోసం తాకట్టు పెట్టొద్దు. 28 మంది వైకాపా ఎంపీలున్నా ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో విఫలమయ్యారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కనీస కేటాయింపులు సాధించలేకపోయారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోకపోవడం విస్మయానికి గురిచేసిందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'అవసరమైతే ప్రాణాలు త్యాగం చేసి స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం'