Adulteration in Medicines: ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మనుషులు.. మద్యంతో పాటు, ప్రజల ప్రాణాలు కాపాడే మందుల్లోనూ కల్తీకి పాల్పడుతున్నారని.. తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం మండిపడ్డారు. జగన్‌కు అత్యంత సన్నిహితుడైన రాంప్రసాద్‌రెడ్డికి చెందిన.. అరబిందో ఫార్మా కంపెనీలో కల్తీ మందులు తయారవుతున్నాయంటూ అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీ (యూఎస్‌ఎఫ్‌డీఏ) సంచలన విషయాలు బయటపెట్టిందని పట్టాభి తెలిపారు.
కల్తీని అరికట్టకపోతే ఆ మందుల్ని అమెరికాలో నిషేధిస్తామని అరబిందోకి యూఎస్‌ఎఫ్‌డీఏ హెచ్చరిక లేఖలు రాసిందని.. పట్టాభి పేర్కొన్నారు. ఆ లేఖల్ని బయటపెట్టారు. ‘మందుల కల్తీకి పాల్పడుతున్న అరబిందో ఫార్మా ఛైర్మన్, ఎండీ రాంప్రసాద్‌రెడ్డి.. ముఖ్యమంత్రి జగన్‌కు బినామీ. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి వియ్యంకుడు. అదే అరబిందోకి జగన్‌రెడ్డి మొత్తం అంబులెన్సుల వ్యవస్థను కట్టబెట్టారు’ అని ఆయన ధ్వజమెత్తారు.
ఆ లేఖలు బయటపెట్టలేదేం?.. ‘యూఎస్‌ఎఫ్‌డీఏ నాణ్యత విభాగం డైరెక్టర్ ఫ్రాన్సిస్ గాడ్విన్ 2022 జనవరి 12న మందుల కల్తీపై అరబిందో ఫార్మాకి లేఖ రాశారు. 2021 ఆగస్టులో తెలంగాణలోని బోరపట్లలో ఉన్న అరబిందో ఫార్మా యూనిట్‌లో తాము చేసిన పరిశీలనలో.. అక్కడ ప్రొడక్షన్, ప్యాకేజింగ్‌లో సీజీఎంపీ (కరెంట్ గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్) ప్రమాణాలు పాటించడం లేదని గుర్తించామని, అరబిందోలో తయారవుతున్న ఏపీఏ (యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రెడియంట్స్)లో కల్తీ జరుగుతోందని తెలిపారు. అరబిందో మందుల తయారీలో వాడుతున్న పదార్థాలు ఫెడరల్ ఫుడ్, డ్రగ్ అండ్ కాస్మొటిక్ యాక్ట్- సెక్షన్ 501 (ఎ) (2) (బి) ప్రకారం సరైనవి కావన్నారు.
అరబిందో ఇచ్చిన సమాధానాలు సరిగా లేవని, కల్తీ జరగకుండా సరిదిద్దే ప్రయత్నం గానీ, వాటిపై లోతైన విచారణ గానీ చేయలేదని అభిప్రాయపడ్డారు. మందుల ఉత్పత్తిలో పాటించాల్సిన కనీస జాగ్రత్తలు, నియంత్రణల్ని అరబిందో యాజమాన్యం పాటించడం లేదన్నారు. దిద్దుబాటు చర్యలు పాటించకపోతే.. అమెరికాతో అరబిందో కొత్త ప్రతిపాదనల్ని నిలిపివేయడమే కాకుండా, తమ దేశంలోకి అరబిందో మందులు రాకుండా నియంత్రిస్తామని హెచ్చరించారు’ అని పట్టాభి వెల్లడించారు. యూఎస్‌ఎఫ్‌డీఏ లేఖలను అరబిందో దాచిపెట్టడంతో.. ఆ సంస్థకు సెబి జూన్ 24న తీవ్ర హెచ్చరికలు జారీచేసిందని తెలిపారు.
‘అప్పుడే కల్తీ మందుల వ్యవహారం బయటపడింది. దీన్నిబట్టి ప్రజల ప్రాణాలతో ఎలా చెలగాటమాడుతున్నారో అర్థమవుతోంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఉన్న అరబిందో ఫార్మా యూనిట్‌లో కల్తీ పదార్థాలు కనుగొన్నామని 2019 జూన్ 20న కూడా యూఎస్‌ఎఫ్‌డీఏ ఒక లేఖ రాసింది. అయినా అరబిందో ఫార్మా పద్ధతి మార్చుకోకుండా తప్పుడు పనులకు పాల్పడుతుండటంతో, 2022 జనవరి 12న రెండోసారి హెచ్చరికలు జారీచేసింది’ అని పేర్కొన్నారు.
కల్తీ మందుల కంపెనీకి 108, 104 బాధ్యతలెలా అప్పగించారు?.. ‘తన బినామీ పి.వి.రాంప్రసాద్‌రెడ్డికి చెందిన అరబిందో ఫార్మాలో కల్తీ మందుల వ్యవహారంపై జగన్‌రెడ్డి ఏం సమాధానం చెబుతారు? అలాంటి కంపెనీకి 108, 104 వాహనాల బాధ్యతలు అప్పగించిన సీఎంని ఏం చేయాలి? జగన్‌రెడ్డి, ఆయన బినామీలు జేబులు నింపుకోడానికి ప్రజల ప్రాణాల్ని సైతం పణంగా పెడుతున్నారు. అలాంటి కంపెనీకి ఇచ్చినందుకే 108, 104 మూలన పడ్డాయి’ అని పట్టాభి దుయ్యబట్టారు.
అల్లుడి కంపెనీపైనా ట్వీట్ చేయాలి.. ‘జగన్‌రెడ్డి కల్తీ మద్యాన్ని దుకాణాల్లో అమ్మించి కొన్ని లక్షలమంది ప్రాణాలతో చెలగాటమాడారు. ఇసుక, మైనింగ్‌లో చేసిన అవినీతి సరిపోక చివరకు మందుల్లోనూ కక్కుర్తి పడుతున్నారు. జగన్ ధనదాహం ఎప్పటికి తీరుతుంది? విజయసాయిరెడ్డి రాజకీయ ప్రత్యర్థులపై కాదు... తన అల్లుడి కంపెనీ వ్యవహారంపై ట్వీట్ చేయాలి. సమాధానం చెప్పాలి’ అన్నారు.
ఇవీ చూడండి: