TDP leader Dulipalla Narendra: రాష్ట్రంలో తాము తప్పితే మరో పరిశ్రమ రాకూడదన్న రీతిలో జగన్ వ్యవహారం ఉందని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆక్షేపించారు. ఏ2 విజయసాయి ద్వారా కాకినాడ సెజ్‌లో అత్యధిక వాటాలు, కాకినాడ గెట్ వే పోర్టు, రామాయపట్నం పోర్టు పనులు, 108, 104 వాహనాలు వంటివి అరబిందో సంస్థకు దక్కేలా చేసింది వాస్తవం కాదా అని నిలదీశారు. ఏ రంగంలోనూ సామర్థ్యంలేని అరబిందోకే అన్నీ మూడున్నరేళ్లలో ఎలా దక్కాయని ప్రశ్నించారు. కేంద్రం ప్రకటించిన బల్క్ డ్రగ్ పార్క్ కూడా అరబిందోకే దక్కనుందన్నారు. క్యాసినోలు, క్రూజ్‌లు, నిర్వహణ, దిల్లీ లిక్కర్ స్కాముల్లో సైతం విజయసాయి కుటుంబ సభ్యులే ఉన్నారని ధూళిపాళ్ల ఆరోపించారు.
విజయసాయి వైకాపా ఎంపీ కాకుంటే ఇవన్నీ మూడున్నరేళ్లలో ఎలా సాధ్యమన్న ఆయన... వీటిపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రలో బీసీలు ఎక్కువగా ఉన్నారంటున్న విజయసాయి పార్టీ ఇన్‌ఛార్జ్‌గా బీసీలను ఎందుకు పెట్టలేదో సమాధానం చెప్పాలన్నారు. ఈ మూడున్నర ఏళ్ల కాలంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరిట విశాఖలో వైకాపా నేతలు చేయని దోపిడీ లేదని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోనే ఈ భూ మహాదోపిడీ జరిగిందని దుయ్యబట్టారు.
జగన్మోహన్ రెడ్డి కేసుల్లో సహ నిందితుల్ని పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్‌లుగా పెట్టడం భూ దోపిడీ కోసమేనన్నారు. విశాఖ నగరంలో భూముల్ని తెదేపా ప్రభుత్వం కాపాడిందని విజయసాయి చెప్పకనే చెప్పారన్నారు. దోపిడీ సొమ్ముతో ఏ1 జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పత్రిక, ఛానల్ పెట్టారని ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ మాత్రమే తనకుందన్న విజయసాయి... వెయ్యి కోట్లతో పత్రికా, ఛానల్ ఎలా పెట్టగలరని నిలదీశారు. సాక్షి మీద నమ్మకం లేకనే దోపిడీ సొమ్ముతో విజయసాయి మరో మీడియా సంస్థ ఏర్పాటు అంటున్నారని ధూళిపాళ్ల నరేంద్ర దుయ్యబట్టారు.
"అరబిందో కంపెనీకి 99 శాతం వాటా ఎలా వచ్చిందో చెప్పాలి. వేల ఎకరాల్లో వాటాలు ఎలా దక్కించుకున్నారో చెప్పాలి. ఏ పోర్టు నిర్మాణంలోనైనా అరబిందో కంపెనీకి సమర్థత ఉందా?. విశాఖలో విలువైన భూములను దోచుకుంటున్నారు. కావాల్సిన వ్యక్తులకు కట్టబెట్టడం వాస్తవం కాదా?. ఆస్తులను కాపాడాల్సిన వాళ్లే కొట్టేస్తారా?. వేల కోట్ల ఆస్తులు విజయసాయి అల్లుడికి ఎలా వచ్చాయో చెప్పాలి. అరబిందో తప్ప ఏ కంపెనీ పనులు చేయలేదా?. అరబిందో కంపెనీలో వైకాపా నాయకులకు వాటా ఉందా?. సమర్థత లేని కంపెనీకి పనులు అప్పగించడమేంటి?. జీఎంఆర్ కంపెనీ చేయలేని పనులు అరబిందో చేస్తుందంటారా?. 3 రాజధానుల చర్చ వచ్చాక విశాఖలో భూదందాలపై విచారణ జరపాలి. చిత్తశుద్ధి ఉంటే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు జవాబుదారీ.. సమాధానం చెప్పాల్సిందే. ప్లాట్, ఇల్లు మాత్రమే ఉందని విజయసాయి చెబుతుంటారు. ఛానల్ పెట్టే డబ్బు ఎక్కణ్నుంచి వచ్చిందో విజయసాయి చెప్పాలి." -ధూళిపాళ్ల నరేంద్ర
ఇవీ చదవండి: