అక్రమ కేసుల సినిమా చూపించటంలో డీజీపీ గౌతమ్ సవాంగ్(dgp gowtham sawang)..రాంగోపాల్ వర్మను మించిపోయారని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్(ex mla chintamaneni prabhakar) విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక నేరగాళ్లు ఎందరో ఉండగా తన కేసుల గురించి డీజీపీ ప్రస్తావించటం ఎంత వరకూ సబబని నిలదీశారు. గూగుల్‌లో 6093 ఖైదీ నెంబర్ కొట్టి.. ఆ వ్యక్తి చరిత్ర మీడియా సమావేశంలో ప్రస్తావించి ఉంటే ఇంకా బాగుండేదన్నారు. తెదేపా నాయకులను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు తనను బంతిలా వాడుకుంటున్నారని చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై 84కేసులున్నాయని ప్రస్తావించిన డీజీపీ.. మరో 800 కేసులైనా పెట్టగలరని ఆక్షేపించారు. మీడియా సమావేశంలో డీజీపీ అనే భావనను గౌతమ్ సవాంగ్ మర్చిపోయారని ఆగ్రహించారు. పోలీసులతోనే తనకు ప్రాణభయం ఉందని చింతమనేని ఆరోపించారు. రాష్ట్రం మరో అప్ఘానిస్తాన్‌లా ఉందన్న ఆయన.. సీఆర్పీఎఫ్ బలగాలతో రక్షణ కల్పించాలని న్యాయస్థానాన్ని కోరనున్నట్లు తెలిపారు.
గృహనిర్భందం చేసేందుకు యత్నించారు
మీడియా సమావేశం నిర్వహించేందుకు పార్టీ కార్యాలయానికి వస్తున్నా గృహనిర్బంధం చేసేందుకు పోలీసులు యత్నించారని ఆరోపణలు చేశారు. తనపై పెట్టిన కేసుల్లో అభియోగపత్రాలు నమోదు చేయకుండా.. మూసివేసిన కేసులపై ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. వనజాక్షి ఘటనలో ఆమెకు సమీపంలో కూడా లేనని ఫిర్యాదులో పేర్కొంటే, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో జగన్రెడ్డి చెప్పిన కట్టుకథల్ని డీజీపీ వినిపించారన్నారని విమర్శించారు. వైకాపాపై అంత వ్యామోహం ఉంటే వేరే రూపంలో ఆ రుణం తీర్చుకోవాలని హితవు పలికారు.
ఇదీ చదవండి: