పట్టణాల్లో డ్రైనేజీ పన్ను, నీటి పన్ను, ఆస్తి పన్నులను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వ్యతిరేకిస్తూ... తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగారు. ఆస్తిపన్ను కట్టడానికి ఆస్తులు అమ్ముకునే పరిస్థితిని వైకాపా ప్రభుత్వం తెచ్చిందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మండిపడ్డారు. పెంచిన ఆస్తి పన్నును తక్షణమే విరమించుకోవాలంటూ విజయవాడలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
అనంతపురంలో
అనంతపురం జిల్లా కదిరిలో 42వ నంబర్ జాతీయ రహదారిపై పార్టీ నేతలు రాస్తారోకో చేపట్టారు. నగర పాలక సంస్థలు, పుర పాలక సంస్థలలో ఇంటి పన్నులు, నీటి పన్నుల పెంపు ఆలోచనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో సామాన్య ప్రజలు బతికేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కళ్యాణదుర్గం నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ భవన్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు పన్నుల పెంపునకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సామాన్యులపై భారం పడేలా ప్రస్తుతం పెంచిన పన్నులను వెంటనే ఉపసంహరించుకోవాలని... లేకుంటే తమ ఆందోళనలను తీవ్రతరం చేస్తామని ఉమామహేశ్వరనాయుడు హెచ్చరించారు.
విజయనగరంలో
ఆస్తి పన్ను, నీటి పన్నుల పెంపు ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని.. విజయనగరం నగరపాలక సంస్థ వద్ద తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే నిత్యావసర, గ్యాస్ ధరలు పెరగటంతో... ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్న సామాన్యులపై, పన్నుల పెంపు నిర్ణయం సరైందికాదని మండిపడ్డారు. అనంతరం మునిసిపల్ కమిషనర్ వర్మకు వినతిపత్రం అందజేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల పరిధిలో సురక్షితమైన తాగునీరు, శానిటైజేషన్ సక్రమంగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని...సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్.పి. భంజ్‌దేవ్ అన్నారు. కరోనా సమయంలో ఆదాయం లేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై ఆస్తి పన్ను, తాగునీటి పన్ను, మురుగు నీటి ( సీవరేజి ) పన్ను అంటూ ఇష్టానుసారంగా పన్నులు పెంచుతూ ప్రభుత్వం ఏకపక్షంగా చట్టాలు తీసుకొచ్చింది అని విమర్శించారు.
పశ్చిమ గోదావరి జిల్లా
సంక్షేమం పేరుతో వైకాపా ప్రభుత్వం పన్నులు పెంచి పేదలకు భారం మోపుతుందని... మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా పన్నులు పెంపును నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిరసన చేపట్టారు. పురపాలక సంఘాల్లో మార్కెట్ ఆధారంగా ఇంటి పన్నులు పెంచడం దారుణమన్నారు. రాష్ట్రంలో వైకాపా పరిపాలనలో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. అనంతరం కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.
విశాఖ జిల్లా
ప్రభుత్వం పన్నులు పెంచుతూ విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని విశాఖలో తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. అధికారంలోకి వచ్చాక మాట తప్పి పన్నులు పెంచారని విమర్శించారు.
ఇదీ చదవండి: