మహిళలపై దాడులకు నిరసనగా తెలుగుదేశం చేపట్టిన మూడ్రోజుల నిరసన ప్రదర్శనలు ముగిశాయి. తొలిరోజు అంబేడ్కర్ విగ్రహాల వద్ద నల్ల రిబ్బన్‌లతో ప్రదర్శనలు, రెండోరోజు దిశ పోలీస్ స్టేషన్ల వద్ద ఆందోళనలు చేసిన నాయకులు చివరి రోజు రమ్య హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కొవ్వొత్తుల ర్యాలీలు చేశారు. ఇందులో పార్టీ అనుబంధ విభాగాలైన తెలుగు మహిళ, తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, మచిలీపట్నంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. అవనిగడ్డలో తెదేపా కార్యాలయం నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు మండలి బుద్ధప్రసాద్ నాయకత్వంలో ప్రదర్శన చేశారు. విజయవాడలోతెలుగు మహిళల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది.
శ్రీకాకుళం జిల్లాలో కొవ్వొత్తుల ర్యాలీకి తెలుగుదేశం నాయకుల్ని వెళ్లనీయకుండా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆమదాలవలసలో కూన రవికుమార్‌ను అరెస్ట్ చేసే క్రమంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. విజయనగరం జిల్లా పార్వతీపురం , కృష్ణపల్లిలో తెదేపా నాయకుల్ని పోలీసులు నిర్బంధించగా... కాకినాడలో మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును నిర్బంధించారు. కొత్తపేటలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావును నిరసనలో పాల్గొనకుండా అడ్డుకున్నారు. పి.గన్నవరంలో పోలీసులు ఆంక్షలను నిరసిస్తూ మాజీ ఎంపీపీ లక్ష్మీ గౌరీ ఇంటి వద్దే నిరసన తెలిపారు. అమలాపురంలో తెలుగు మహిళా నేతలు పోలీసుల ఆంక్షలపై మండిపడ్డారు.
నెల్లూరులో కరెంట్ ఆఫీస్ సెంటర్‌లో తెలుగుదేశం నేతలు కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. కావలిలో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. గూడూరులో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్‌ను నిర్బంధించారు. అనంతపురం జిల్లా హిందూపురం, కళ్యాణదుర్గంలో కొవ్వొత్తుల ర్యాలీలు జరగకుండా అడ్డుకున్నారు. కడపలో తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. కర్నూలులో తెలుగు మహిళ, యువత, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ప్రదర్శనలు నిర్వహించారు.
ఇదీ చదవండి: అమానుషం: కన్నబిడ్డతోపాటు మరో బాలికపై తండ్రి అత్యాచారం