ముందుస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో వైకాపా ప్రభుత్వం ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. అది మరింత పెరిగితే నష్టమని భావించి వైకాపా ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోందన్నారు. తొందర్లోనే ఎన్నికలు వస్తాయని ప్రజలు చర్చించుకుంటున్నారని.., తాము కూడా అదే భావనతో ఉన్నట్లు తెలిపారు.
వైకాపా ప్రభుత్వం ముందుస్తు ఎన్నికలకు వెళితే.. తెదేపాకు 160 సీట్లు వస్తాయని అచ్చెన్న ధీమా వ్యక్తం చేశారు. తాను గుడ్డిగా ఆ మాట చెప్పట్లేదని, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు వైకాపా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు.
వెయ్యి రోజుల పాలనలో.. వెయ్యి తప్పులు!
ముఖ్యమంత్రి జగన్ తన వెయ్యి రోజుల పాలనలో వెయ్యి తప్పులు చేశారంటూ తెలుగుదేశం పార్టీ "ప్రజా ఛార్జిషీట్" విడుదల చేసింది. విధ్వంస పాలనలో 1000 నేరాలు, ఘోరాలు, లూటీలు, అసత్యాలు పేరిట ప్రత్యేక సంచికను అచ్చెన్నాయుడు సహా నేతలు విడుదల చేశారు. ప్రజావేదిక కూల్చివేత వంటి అశుభ కార్యంతో పాలన ప్రారంభించిన జగన్.. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు.
ఇదీ చదవండి
Varla letter to DGP: 'సంఘ విద్రోహశక్తుల నుంచి చంద్రబాబుకు ముప్పు ఉంది..' డీజీపీకి వర్ల రామయ్య లేఖ